

ప్రభాత ఉదయం, అమరావతి : తుఫాన్లపై ముందస్తు హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మురసు తుఫాన్‌తో నష్టం వాటిల్లిన బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా బాపట్ల మండలం జిళ్లేల్లమూడి వంతెన వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. సమీపంలో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. అర్నబ్, మురసు తుఫాన్లతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని, పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్లతో రైతులు నష్టపోయారని తెలిపారు. తీర ప్రాంతాలను తుఫాన్లు దెబ్బతీస్తే, రాయలసీమను ఎల్ నినో దెబ్బతీస్తోందని చెప్పారు. మురసు తుఫాన్ రైతులను దెబ్బతీసిందని, ప్రభుత్వం తీసుకున్న ముందుస్తు చర్యలతో చాలా వరకు నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలను మురసు తుఫాన్ దెబ్బతీసిందని చెప్పారు. ప్రతి రైతు పంట బీమా చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీతో నష్టపోయిన పెట్టుబడిని రైతులు దక్కించుకోవచ్చన్నారు. తుఫాన్ సహాయక చర్యల కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సాయం తీసుకుంటున్నామని తెలిపారు. అర్నబ్ తుఫాన్‌తో 30 వేలు, మురసు తుఫాన్ వల్ల 10 వేల విద్యుత్ స్థంభాలు దెబ్బతిన్నాయని చెప్పారు. రెండు తుఫాన్లతో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, తుఫాన్ల ప్రభావాన్ని ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన ప్రతి వ్యక్తికి సాయం అందేంత వరకు పని చేస్తామని సీఎం వెల్లడించారు.