

ముఖ్యమంత్రి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే. సాధారణంగా శాసనసభలో మెజార్టీ సాధించిన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు. అయితే ముఖ్యమంత్రి కావడానికి తప్పనిసరిగా ఎమ్మెల్యే అయి ఉండాలనే నిబంధన లేదు. శాసనమండలి సభ్యుడైన ఎమ్మెల్సీ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టవచ్చు. రాజ్యాంగం ఈ అవకాశాన్ని కల్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనూ ఎమ్మెల్యేలు కాకుండా ఎమ్మెల్సీలుగా కొనసాగుతూనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ వివరాలను తెలుసుకుందాం..
భవనం వెంకటరామిరెడ్డి
ఎమ్మెల్సీగా కొనసాగుతూ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తి. టంగుటూరి అంజయ్య స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8వ ముఖ్యమంత్రిగా 1982, ఫిబ్రవరి 24న ముఖ్యమంత్రగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి వరకు అంజయ్య మంత్రివర్గంలో విద్యా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భవనం వెంకటరామిరెడ్డి 1982, ఫిబ్రవరి 24 నుంచి 1982, సెప్టెంబర్ 20 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంజయ్య మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగావెంకట్రామిరెడ్డి మంత్రివర్గంలో నారా చంద్రబాబు నాయుడు , వైయస్ రాజశేఖర్ రెడ్డి , మంత్రులుగా పని చేశారు. భవనం వెంకటరామిరెడ్డి గుంటూరు జిల్లా ముప్పళ్ల మండలం గోళ్లపాడులో 1931 జూలై 18న జన్మించారు. 1978లో శాసనమండలికి ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య మంత్రివర్గాలలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భవనం వెంకటరామిరెడ్డి భార్య భవనం జయప్రద కూడా రాజకీయ నాయకురాలే. 1967, 1972 ఎన్నికలలో గుంటూరు జిల్లా వినుకొండ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. పి.వి.నరసింహారావు, జలగం వెంగళరావు క్యాబినెట్లలో మంత్రిగా పని చేసింది. భవనం వెంకట్రామిరెడ్డి, ఆయన భార్య భవనం జయప్రద ఒకే సమయంలో మంత్రివర్గంలో సేవలు అందించడం ఒక అరుదైన మైలురాయి. వీరిద్దరూ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో (1978–1980) ఒకేసారి కేబినెట్ మంత్రులుగా పనిచేశారు. ఆ సమయంలో భవనం వెంకట్రామిరెడ్డి విద్యుత్- విద్యాశాఖల బాధ్యతలు నిర్వహించగా, భవనం జయప్రద మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భారతీయ రాజకీయాల్లో భార్యాభర్తలిద్దరూ ఒకే రాష్ట్ర మంత్రివర్గంలో సహచర మంత్రులుగా పనిచేసిన అత్యంత అరుదైన సందర్భాలలో ఇది ఒకటి.
కొణిజేటి రోశయ్య
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో అప్పటి ఆర్ధిక మంత్రి కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010, నవంబర్ 24 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్ గా వెళ్లారు. కొణిజేటి రోశయ్య గుంటూరు జిల్లా వేమూరులో 1933లో జన్మించారు. ఆయన మొదటిసారి 1968లో శాసనమండలికి ఎన్నికయ్యారు, తర్వాత 1974, 1980లలో కూడా మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1989, 2004లలో చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి ఎంపీగా కూడా గెలిచారు.2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మళ్లీ చీరాల నుంచి పోటీ చేయలేదు. 2009 జనవరిలో జరిగిన ఎన్నికల్లో MLAల కోటా నుంచి శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంటే రోశయ్య రాజకీయ జీవితంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా కొనసాగిన అరుదైన ప్రయాణం కనిపిస్తుంది.
ఇద్దరిది ఒకే జిల్లా
ఎమ్మెల్సీగా ఉంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భవనం వెంకటరామిరెడ్డి, కొణిజేటి రోశయ్య ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారే కావడం గమనించాల్సిన విషయం.