

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1999 ఎన్నికలు ఎన్నో చారిత్రాత్మక సంఘటనలు వేదికగా నిలిచాయి. టీడీపీ చంద్రబాబు నేతృత్వంలో ఎన్నికల పోరుకు సిద్ధమైతే..ఒకప్పటి చంద్రబాబు అప్తమిత్రుడు వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. ఇద్దరి అప్తమిత్రుల మధ్య సమరం ఎన్నికల ముఖచిత్రాన్ని ఆసక్తికరంగా మార్చితే..మరోవైపు 1995లో ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబుకు పార్టీ, ప్రత్యర్ధుల నుంచి ఎటువంటి విమర్శలకు తావులేకుండా తన సామర్ధ్యాన్ని, నాయకత్వంతోపాటు ప్రజల మద్దతు తనకు ఉందని కూడా నిరూపించుకోవాల్సిన పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ లేని లోటు లేకుండా 1999 ఎన్నికలలో చంద్రబాబు టీడీపీని విజయ తీరాలకు ఎలా చేర్చారు? అందుకు ఆయన అనుసరించిన వ్యూహాలు? కాంగ్రెస్ ఎందుకు విజయం సాధించలేదు? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
1999 ఎన్నికలలో చంద్రబాబు తన మార్క్ వ్యూహాలను బలంగా అమలు చేశారు. ముఖ్యంగా వామపక్షాలను వదులుకొని బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలో తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. కార్గిల్ యుద్ధంలో విజయం, కేంద్రంలో వాజ్‌పేయి ప్రభావం, పరిపాలనా సంస్కరణల ప్రచారం, హైదరాబాద్ ఐటీ అభివృద్ధి ఇమేజ్, కాంగ్రెస్‌లోని అంతర్గత బలహీనతలు.. అన్నీ కలసి టీడీపీకి భారీ విజయాన్ని అందించాయి. 294 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 180 సీట్లు, బీజేపీ 12 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 91 స్థానాలకే పరిమితమైంది.
ఎన్టీఆర్ తర్వాత టీడీపీ భవిష్యత్తుపై సందేహాలు
1996 జనవరిలో ఎన్టీఆర్ మరణంతో తెలుగుదేశం పార్టీ ఒక కీలక దశలోకి ప్రవేశించింది. 1982లో ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఆయన వ్యక్తిత్వంతోనే బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఆయన పేరు, ప్రజాదరణ, సినిమాల ద్వారా ఏర్పడిన మాస్ ఇమేజ్, “తెలుగు ఆత్మగౌరవం” అనే రాజకీయ నినాదం టీడీపీకి ప్రధాన బలాలు. కానీ 1995లోనే పార్టీలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. చంద్రబాబు నాయుడు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో ఎన్టీఆర్‌ను పక్కనపెట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పరిణామం టీడీపీని రెండు వర్గాలుగా విభజించింది. ఎన్టీఆర్ అనుచరులు చంద్రబాబును వ్యతిరేకించారు. లక్ష్మీపార్వతి వర్గం ఎన్టీఆర్ టీడీపీ పేరుతో రాజకీయంగా కొనసాగింది. అలాంటి పరిస్థితిలో 1999 ఎన్నికలు చంద్రబాబుకు కేవలం మరో సాధారణ ఎన్నికలు కాదు. “ఎన్టీఆర్ లేకుండా టీడీపీని గెలిపించగలరా?” అనే ప్రశ్నకు ప్రజలే సమాధానం చెప్పాల్సిన ఎన్నికలుగా మారాయి.
ఎన్టీఆర్ కు భిన్నమైన నాయకత్వం
1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నాలుగేళ్ల పాలన తర్వాత ప్రజల ముందుకు వెళ్లింది. చంద్రబాబు రాజకీయ శైలి ఎన్టీఆర్ శైలికి పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రజాకర్షణ, సంక్షేమం, భావోద్వేగం, తెలుగు ఆత్మగౌరవం ప్రధానంగా ఉండగా.. చంద్రబాబు పరిపాలన, ఆర్థిక సంస్కరణలు, సాంకేతికత, పెట్టుబడులు, ఐటీ, మౌలిక వసతులు, ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు వంటి అంశాలను ముందుకు తెచ్చారు. ఇది అప్పట్లో కొత్త రాజకీయ మోడల్. ముఖ్యమంత్రి అంటే కేవలం సంక్షేమ పథకాలు ప్రకటించే వ్యక్తి మాత్రమే కాకుండా.. రాష్ట్రాన్ని ఒక సంస్థలా నిర్వహించే CEO తరహా నాయకత్వం అనే ఇమేజ్ను చంద్రబాబు నిర్మించుకున్నారు.
చంద్రబాబు ముందున్న రెండు సవాళ్లు
1999లో చంద్రబాబు ఎదుర్కొన్న సవాళ్లను రెండు కోణాల్లో చూడాలి. మొదటిది.. టీడీపీని ఎన్టీఆర్ నీడ నుంచి బయటకు తీసుకురావడం. రెండోది.. కాంగ్రెస్ పుంజుకోకుండా చూడటం. 1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఘన విజయం సాధించింది. కానీ 1995లో నాయకత్వ మార్పు తర్వాత చంద్రబాబు నాయకత్వంపై ప్రజల్లో పూర్తిస్థాయి అంగీకారం ఏర్పడిందా అన్నది స్పష్టంగా తెలియలేదు. అందుకే 1999లో చంద్రబాబు తన నాయకత్వాన్నే ఎన్నికల ప్రధాన అంశంగా మార్చారు.
బీజేపీతో పొత్తు.. చంద్రబాబు కీలక వ్యూహం
1999 ఎన్నికల్లో చంద్రబాబు అనుసరించిన అత్యంత కీలక వ్యూహాల్లో బీజేపీతో పొత్తు ఒకటి. అప్పటికి దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోంది. కార్గిల్ యుద్ధం తర్వాత జాతీయ భద్రత, దేశభక్తి, స్థిరమైన ప్రభుత్వం వంటి అంశాలు బీజేపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. ఈ పరిస్థితిని చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ–బీజేపీ కలిసి పోటీ చేయడంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఓటర్లలో ఒక వర్గం ఈ కూటమి వైపు మళ్లింది. టీడీపీ 180 స్థానాలు, బీజేపీ 12 స్థానాలు గెలవడంతో రెండు పార్టీలకు కలిపి 192 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. దీంతో టీడీపీకి ఒంటరిగా ఉన్న బలంతో పాటు మిత్రపక్షం ద్వారా అదనపు రాజకీయ ప్రయోజనం లభించింది.
వాజ్‌పేయి–చంద్రబాబు కాంబినేషన్
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. వాజ్‌పేయి అప్పటి బీజేపీ నాయకులకు భిన్నంగా కేంద్రంలో మితవాద, అభివృద్ధి, జాతీయ భద్రతా నాయకుడిగా ప్రజల్లో ఆదరణ పొందారు. మధ్యతరగతి ప్రజల్లో వాజ్‌పేయికి పాజిటివ్ దృక్ఫథం ఉంది. కార్గిల్ విజయంతో ఆయన ఈమేజ్ మరింత పెరిగింది. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏతో పొత్తు ద్వారా కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం, రాష్ట్రానికి కేంద్ర సహకారం, అభివృద్ధి వంటి అంశాలను కూడా ఎన్నికల చర్చలోకి తీసుకొచ్చారు. దీంతో ఎన్నికలు కేవలం చంద్రబాబు పాలనకు ప్రజల తీర్పుగా మాత్రమే కాకుండా.. రాష్ట్రంలో టీడీపీ–బీజేపీ, కేంద్రంలో వాజ్‌పేయి నాయకత్వం అనే విస్తృత రాజకీయ సమీకరణంగా మారాయి. ఈ వ్యూహం లోక్‌సభ ఎన్నికల్లో బాగా పనిచేసింది. లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ 34 స్థానాల్లో పోటీ చేసి 29 గెలుచుకోగా, బీజేపీ 8 స్థానాల్లో పోటీ చేసి 7 గెలిచింది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి 42 లోక్‌సభ స్థానాల్లో 36 గెలుచుకుంది. కాంగ్రెస్‌కు కేవలం 5 సీట్లు మాత్రమే వచ్చాయి.
అభివృద్ధి బ్రాండ్.. ప్రచారానికి ప్రధాన ఆయుధం
చంద్రబాబు తన ఐదేళ్ల పాలనను కేవలం ప్రభుత్వ పనితీరుగా కాకుండా అభివృద్ధి, ఆధునికీకరణకు ప్రతీకగా ప్రజల ముందుంచారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి, హైటెక్ సిటీ, సైబరాబాద్, రహదారులు, పెట్టుబడులు, పరిశ్రమలు, పరిపాలనలో కంప్యూటరీకరణ వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేశారు. జన్మభూమి, డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా ఏర్పడిన బలమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోగలిగారు. రాష్ట్రాన్ని ఆధునిక పారిశ్రామిక, సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే దృక్పథాన్ని ఆయన ముందుకు తెచ్చారు. అప్పటివరకు ఎన్నికల రాజకీయాల్లో పేదరికం, రైతుల సమస్యలు, ధరలు, సంక్షేమం, కుల–ప్రాంత సమీకరణాలు ప్రధానంగా ఉండగా.. చంద్రబాబు వాటితోపాటు అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతికత, పరిపాలనా సంస్కరణలు అనే కొత్త రాజకీయ భాషను బలంగా వినిపించారు. ఇది ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి, యువతలో ఆయనకు ప్రత్యేకమైన ఆధునిక నాయకుడి ఇమేజ్ను తీసుకొచ్చింది. 1990ల చివర్లో హైదరాబాద్ వేగంగా మారుతోంది. ఐటీ రంగం, సాఫ్ట్వేర్ కంపెనీలు, విదేశీ పెట్టుబడులు, కొత్త రహదారులు, సైబరాబాద్ అభివృద్ధి.. ఇవన్నీ నగరానికి కొత్త రూపాన్ని ఇస్తున్నాయి. చంద్రబాబు ఈ మార్పును కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా తన నాయకత్వానికి ప్రతీకగా ప్రచారం చేసుకున్నారు. అందుకే 1999 ఎన్నికల సమయానికి చంద్రబాబుకు రెండు భిన్న ఇమేజ్‌లు ఏర్పడ్డాయి. ఒకటి సంస్కరణల ముఖ్యమంత్రి, రెండోది ప్రజలకు దూరంగా ఉండే CEO ముఖ్యమంత్రి అనే విమర్శలు వచ్చాయి.
బలమైన క్యాడర్.. టీడీపీకి మరో బలం
చంద్రబాబు విజయానికి మరో ముఖ్య కారణం టీడీపీకి ఉన్న బలమైన సంస్థాగత నిర్మాణం. గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు పార్టీకి ఉన్న కార్యకర్తల నెట్వర్క్ ఎన్నికల సమయంలో కీలకంగా పని చేసింది. అభ్యర్థుల ప్రచారం, ఓటర్లను సమీకరించడం, స్థానిక రాజకీయ సమీకరణాలను అంచనా వేయడం వంటి అంశాల్లో పార్టీ యంత్రాంగం చురుగ్గా వ్యవహరించింది. నాయకత్వం, పార్టీ సంస్థాగత బలం, ఎన్నికల నిర్వహణలో సమన్వయం టీడీపీకి నియోజకవర్గాల వారీగా ప్రయోజనం చేకూర్చింది. అందుకే కాంగ్రెస్‌కు దాదాపు సమానమైన ఓట్ల శాతం వచ్చినప్పటికీ.. టీడీపీ వాటిని భారీ సంఖ్యలో సీట్లుగా మలచుకోగలిగింది.
ఎన్టీఆర్ పేరును ఎలా ఉపయోగించుకున్నారు?
ఇక్కడ చంద్రబాబు వ్యూహంలోని మరో ముఖ్యమైన అంశం కనిపిస్తుంది. ఎన్టీఆర్ వారసత్వాన్ని పూర్తిగా తిరస్కరించలేదు. అదే సమయంలో తన రాజకీయాన్ని కేవలం ఎన్టీఆర్ పేరుపైనే ఆధారపెట్టలేదు. ఎన్టీఆర్ నిర్మించిన పార్టీని.. ఆధునిక కాలానికి అనుగుణంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడు అనే స్థానాన్ని తీసుకున్నారు. ఇది చాలా కీలకమైన వ్యూహం. ఎన్టీఆర్ కుటుంబంలోనే తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు ఉన్నప్పటికీ.. పార్టీ సంస్థాగత యంత్రాంగం మాత్రం చంద్రబాబు చేతుల్లోనే ఉండేలా చేశారు. చంద్రబాబుకు మరో సవాలు నందమూరి హరికృష్ణ, లక్ష్మీపార్వతి వర్గాలు. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన రాజకీయ వారసత్వంపై పోటీ మొదలైంది. నందమూరి హరికృష్ణ అన్నా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. లక్ష్మీపార్వతి వర్గం కూడా ఎన్టీఆర్ పేరుతో రాజకీయంగా కొనసాగింది. అయితే ఈ పార్టీలు ఎన్నికల్లో గణనీయమైన సీట్లను గెలుచుకోలేకపోయాయి. 1999లో అన్నా తెలుగుదేశం, ఎన్టీఆర్ టీడీపీ (లక్ష్మీపార్వతి) వంటి వర్గాలు ఓట్లను కొంతవరకు చీల్చినా ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు. ఇది చంద్రబాబుకు రాజకీయంగా పెద్ద ఉపశమనం. ఎందుకంటే టీడీపీ అసలు వారసత్వం ఎవరిది? అనే ప్రశ్నను ఎన్నికల ఫలితాలు ఒక రకంగా ఆయనకు అనుకూలంగా పరిష్కరించాయి.
ఓట్లు దాదాపు సమానమే..మరి కాంగ్రెస్ ఎందుకు విజయం సాధించలేదు?
1999 ఫలితాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం టీడీపీ-కాంగ్రెస్ మధ్య ఓట్ల శాతం తేడా. టీడీపీకి 43.87 శాతం, కాంగ్రెస్‌కు 40.61 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే తేడా 3.26 శాతం. కానీ టీడీపీ 180 స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ 91 స్థానాలకే పరిమితమైంది. అంటే సీట్ల తేడా 89. 1999 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేందుకు అనుకూల వాతావరణం కనిపించినప్పటికీ, వ్యూహాత్మక లోపాల వల్ల తీవ్ర వైఫల్యాన్ని చవిచూడాల్సి వచ్చింది.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపినప్పటికీ, పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఆయనకు లభించడంతో వర్గపోరుతో కూరుకుపోయిన పార్టీని పూర్తిస్థాయిలో సమాయత్తం చేయడానికి సమయం సరిపోలేదు. 2003లో చేపట్టిన పాదయాత్ర ద్వారా ఏర్పడినంత విస్తృతమైన ప్రజా అనుసంధానం 1999 నాటికి ఇంకా ఆయనకు ఏర్పడలేదు. మరోవైపు వైఎస్ రాజశేఖరరెడ్డి బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఎదుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్ కూడా టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఒక స్పష్టమైన ఎన్నికల కథనాన్ని నిర్మించడంలో వెనుకబడింది.
చంద్రబాబు తన ప్రభుత్వాన్ని అభివృద్ధి, ఆధునికీకరణ చుట్టూ కేంద్రీకరిస్తే.. కాంగ్రెస్ ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతను ఎన్నికల అంశంగా మార్చుకోవడంపైనే ఎక్కువగా ఆధారపడింది. అది టీడీపీని ఓడించడానికి సరిపోలేదు. దీనికితోడు, జాతీయ స్థాయిలో తెదేపా-భాజపా కూటమి కట్టిన వ్యూహం కాంగ్రెస్‌ను ఒంటరిని చేసింది. ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఉన్న ప్రజాదరణ, 'కార్గిల్ విజయం' ప్రతిపక్ష ఓట్లను తెదేపా-భాజపా వైపు మొగ్గేలా చేశాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విదేశీ మూలాల అంశాన్ని ప్రతిపక్షాలు ముమ్మరంగా ప్రచారంలోకి తేవడం కూడా పట్టణ, మధ్యతరగతి ఓటర్లలో ప్రభావం చూపింది. మరోవైపు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి నాయకత్వంలోని 'ఎన్టీఆర్ తెదేపా', హరికృష్ణ స్థాపించిన 'అన్న తెదేపా'లు మూడో శక్తిగా నిలిచి చంద్రబాబు ఓట్లను భారీగా చీలుస్తాయని కాంగ్రెస్ ఆశించింది. కానీ ఎన్టీఆర్ అభిమానులు, సాంప్రదాయ తెదేపా ఓటర్లు చంద్రబాబు నాయకత్వాన్నే ఆమోదించడంతో ఆ వ్యూహం తలకిందులైంది. చంద్రబాబు అమలు చేసిన జన్మభూమి, డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా ఏర్పడిన బలమైన ఓటు బ్యాంకును, ఐటీ బ్రాండింగ్‌ను తిప్పికొట్టే బలమైన ప్రత్యామ్నాయ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమై చివరకు 91 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది.
1999 గెలుపు.. 2004 ఓటమికి విత్తనాలా?
1999లో అభివృద్ధి, ఐటీ, సంస్కరణలను ప్రధానంగా చేసుకుని చంద్రబాబు భారీ విజయం సాధించినప్పటికీ.. తర్వాతి ఐదేళ్లలో అదే పాలనా నమూనాపై విమర్శలు కూడా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సమస్యలు, విద్యుత్ ఛార్జీలు, ఆర్థిక సంస్కరణల ప్రభావం, ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత వంటి అంశాలు క్రమంగా రాజకీయ ప్రభావాన్ని చూపాయి. 2000లో బషీర్‌బాగ్ కాల్పుల ఘటన కూడా చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతికూల రాజకీయ అంశంగా మారింది. మరోవైపు 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చేవెళ్ల–ఇచ్చాపురం పాదయాత్ర కాంగ్రెస్‌కు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఊపును తీసుకొచ్చింది. దీంతో 1999లో విజయాన్ని అందించిన చంద్రబాబు రాజకీయ మోడల్ 2004 నాటికి అదే స్థాయిలో ప్రజలను ఆకట్టుకోలేకపోయింది.
ఎన్టీఆర్ నీడ నుంచి చంద్రబాబు బ్రాండ్ వరకు
1999 ఎన్నికలను కేవలం ఎన్టీఆర్ లేకుండా టీడీపీ గెలిచిన ఎన్నికగా చూడటం కంటే.. ఎన్టీఆర్ బ్రాండ్ నుంచి చంద్రబాబు బ్రాండ్ టీడీపీగా ఎదగటం. ఎన్టీఆర్ ఆశయాలతో నిర్మితమైన పార్టీని చంద్రబాబు తన పాలనా శైలి, అభివృద్ధి ఎజెండా, బీజేపీతో వ్యూహాత్మక పొత్తు, బలమైన పార్టీ యంత్రాంగంతో ముందుకు నడిపించారు. 180 అసెంబ్లీ సీట్లతో వచ్చిన ఈ విజయం చంద్రబాబు నాయకత్వానికి రాజకీయంగా బలమైన ముద్ర వేసింది. ఆయనను జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా నిలబెట్టింది. అయితే అదే సమయంలో 1999లో పనిచేసిన అభివృద్ధి–సంస్కరణల రాజకీయానికి ఉన్న పరిమితులు తదుపరి ఐదేళ్లలో బయటపడటం, 2004లో వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన మలుపుగా మారింది.