

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఢిల్లీలో కొనసాగుతున్న బాబు పర్యటన
ఢిల్లీ: గోదావరి పుష్కరాల నాటికి ‘పోలవరం’ ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి చేశామని.. కేంద్రం సహకారంతో మిగిలిన పనులు పూర్తిచేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు గురువారం పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఏపీ ప్రాజెక్టులకు ప్రాధాన్య క్రమంలో నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చంద్రబాబు తెలిపారు. గోదావరి, కృష్ణా జలాల అనుసంధానంపై కేంద్రానికి ప్రతిపాదనలు అందజేసినట్టు చంద్రబాబు పేర్కొన్నారు.
సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ
కేంద్రజలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం రూ. 30 వేల కోట్లతో చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్ 2.0.. అమరజీవి జలధార’ పనుల వివరాలను కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 62 లక్షల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని.. ఇప్పటికే 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు అందించేలా పనులకు శంకుస్థాపన చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం సహకరిస్తే ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. అనంతరం కేంద్రహోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.