

ప్రభాత ఉదయం, అమరావతి : వానాకాలంలో సరైన వర్షాలు లేక సాగు, తాగు నీటికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉండగా ‘మురసు’ తుఫానుతో ఆ సమస్య తీరేలా కనిపిస్తోంది. ఏపీలోని రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు సమీపంలో తీరందాటనున్న మురసు కారణంగా దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పల్నాడు జిల్లాలో 30 సెంటీమీటర్లు, ప్రకాశంలో 24, మార్కాపురంలో 19, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 9 సె.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏలూరులో 9, నెల్లూరులో 9 సెం.మీ. మేర వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఫలితంగా నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు 30 టీఎంసీల నుంచి 50 టీఎంసీలతోపాటు గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 1.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద రావచ్చని అంచనా వేస్తున్నారు.