

అమరావతి : అర్నబ్ తుపాన్ నుంచి ఏపీ తేరుకోకముందే మరో తుఫాన్ విజృంభించేందుకు సిద్ధమవుతోంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఆదివారం సాయంత్రంకల్లా తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం వెల్లడించింది. నవంబర్ 2న ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా ‘అర్నబ్’ తుపాను ప్రభావంతో తీవ్ర నష్టం ఎదుర్కొన్న ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు మరోసారి వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. కొత్త తుఫాను పూర్తిస్థాయిలో ఏర్పడితే దానికి ‘మురాసు’ అని పేరు పెట్టనున్నారు. తమిళంలో మురాసు అంటే డప్పు అని అర్థం. నవంబర్ 2, 3న ఏపీ తీరప్రాంతాలు, పుదుచ్చేరిలోని యానాంలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో నవంబర్ 2, 3 తేదీల్లో, ఒడిశాలో 3, 4 తేదీల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.
బలమైన ఈదురుగాలులు..
కొత్తగా ఏర్పడనున్న తుఫాను తీవ్రత ‘అర్నబ్’తో పోలిస్తే తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని, అప్పుడప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి ఏపీ, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నానికి ఏపీ తీరంలో గాలుల వేగం గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లకు చేరవచ్చు. అప్పుడప్పుడు 85 కిలోమీటర్ల వేగంతో, అదే రోజు సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 4 ఉదయానికి గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్లకు తగ్గుతుందని, ఆ తర్వాత వాతావరణం క్రమంగా మెరుగుపడుతుందని అంచనా వేసింది. దక్షిణ ఒడిశా తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది.
‘అర్నబ్’ నష్టాల నుంచి కోలుకోకముందే..
అక్టోబర్ 28న ‘అర్నబ్’ తుఫాను ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల్లో బాపట్ల, విశాఖపట్నం ప్రాంతాల మధ్య తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇండ్లను వరద ముంచెత్తింది. పొలాలు నీటమునిగాయి. రవాణా, విద్యుత్ వ్యవస్థలు స్తంభించాయి. తీవ్ర నష్టం తేరుకోకముందే మరో తుఫాను హెచ్చరికలు రావడంతో తీరప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది.