ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో..రెండు సార్లు రాష్ట్రపతి పాలన!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో..రెండు సార్లు రాష్ట్రపతి పాలన!
SOURAV KARMAKAR
Published on: 

1956 నవంబర్‌ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి 2014 జూన్‌ 2న రాష్ట్ర విభజన జరిగే వరకు 58 సంవత్సరాల రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు, ప్రభుత్వ మార్పులు, రాజకీయ సంక్షోభాలు చోటుచేసుకున్నాయి. అయితే ఆర్టికల్ 356 కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించేంతటి పరిస్థితి ఏర్పడింది మాత్రం రెండుసార్లే. ఒకవైపు ప్రాంతీయ ఆందోళనలు, మరొకవైపు చారిత్రాత్మక రాష్ట్ర విభజన పరిణామాలు ఈ అత్యవసర పరిస్థితులకు దారితీశాయి. ఉమ్మడి పాలన ప్రారంభంలో మరియు అది ముగిసే చివరి ఘట్టంలో విధించిన ఆ రెండు రాజ్యాంగ సంక్షోభాల సమగ్ర వివరాలు ఇక్కడ చూద్దాం..

1973.. ఉద్యమాల మంటల్లో రాష్ట్రపతి పాలన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి రాష్ట్రపతి పాలన 1973 జనవరిలో విధించే పరిస్థితి ఏర్పడింది. అప్పటికి పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రాంతీయ అసంతృప్తి కొనసాగుతుండగా, తెలంగాణ ప్రాంత ఉద్యోగాల రక్షణకు ఉద్దేశించిన 'ముల్కీ నిబంధనలు' చెల్లుబాటు అవుతాయని 1972 అక్టోబరులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 'జై ఆంధ్రా ఉద్యమం' తీవ్రరూపం దాల్చింది. ఈ ఉద్యమ ప్రభావంతో శాంతిభద్రతలు క్షీణించి పాలనా యంత్రాంగం స్థంభించిపోయింది. దీంతో ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహారావు 1973 జనవరి 17న తన పదవికి రాజీనామా చేశారు. దాంతో కేంద్రంలో ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం 1973 జనవరి 18 నుండి 1973 డిసెంబరు 10 వరకు (327 రోజులు) రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించింది. ఆ సమయంలో ఖండుభాయ్ కాసంజీ దేశాయ్ (Khandubhai Kasanji Desai) గవర్నర్‌గా ఉన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం వివాదాల పరిష్కారానికి 'ఆరు సూత్రాల పథకాన్ని' (Six-Point Formula) ప్రకటించి, రెండు ప్రాంతాల నేతలను ఒప్పించిన తర్వాత రాష్ట్రపతి పాలనను ఎత్తివేసింది. 1973 డిసెంబర్‌ 10న రాష్ట్రపతి పాలన ఎత్తివేసి, జలగం వెంగళరావును ముఖ్యమంత్రిగా నియమించారు. జలగం వెంగళరావు 1978 మార్చి 6 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.

2014.. రాష్ట్ర విభజన ముందు మరోసారి రాష్ట్రపతి పాలన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి, చివరిసారిగా రాష్ట్రపతి పాలన 2014లో విధించారు. అప్పటికి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్‌కుమార్‌రెడ్డి 2014 ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి, ప్రభుత్వానికి దూరమయ్యారు. దీంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన రాజకీయ స్థిరత్వం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు నిర్ణయించింది. 2014 మార్చి 1 నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో ఈ.ఎస్.ఎల్. నరసింహన్‌ గవర్నర్ గా ఉన్నారు.

ఈసారి రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగానే 2014 జూన్‌ 2న ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయింది. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన అదే రోజు ముగిసి కే. చంద్రశేఖరరావు నేతృత్వంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాష్ట్రపతి పాలన జూన్‌ 8, 2014 వరకు కొనసాగింది. ఆ రోజు రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.