విశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ పిచ్‌ టవర్‌ యూనిట్‌లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడటంతో దట్టమైన పొగ కమ్ముకుంది. కార్మికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Fire at HPCL Visakhapatnam refinery
విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలోని పిచ్‌ టవర్‌ యూనిట్‌లో అగ్నిప్రమాదం
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాజువాక సమీపంలోని హెచ్‌పీసీఎల్‌ విశాఖ రిఫైనరీ ప్రాంగణంలో ఉన్న పిచ్‌ టవర్‌ యూనిట్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించిన అనంతరం మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయని స్థానికులు తెలిపారు.

దట్టమైన పొగతో భయాందోళనలు

ప్రమాదం కారణంగా రిఫైనరీ పరిసర ప్రాంతాలను దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. ఆకాశంలోకి ఎగసిపడుతున్న మంటలు, పొగను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వాహనాలతో ఘటనాస్థలికి చేరుకున్నారు. హెచ్‌పీసీఎల్‌ భద్రతా విభాగం బృందాలతో కలిసి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

కార్మికుల తరలింపు

ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై చుట్టుపక్కల ఉన్న సిబ్బంది, కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం అర్ధరాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదని సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.