మ‌న‌మిత్ర సూపర్ సక్సెస్

అర్నబ్‌ తుపాన్‌ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ‘మనమిత్ర’ వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలు బాధితులకు అండగా నిలిచాయి.
మ‌న‌మిత్ర సూపర్ సక్సెస్
Published on: 

ప్రభాత ఉదయం, అమరావతి : అర్నబ్ తుపాన్ వేళ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ బాధితుల‌కు కొండంత భ‌రోసాగా నిలిచింది. ప్రజలు మ‌న‌మిత్రను త‌మ వాట్సాప్‌ డీపీ స్టేట‌స్‌గా పెట్టుకున్న తీరు..దానికి లభించిన ప్రజాదరణకు నిదర్శనం. దీంతో విపత్తు వేళ మనమిత్ర 9552300009 నెంబర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజల హౌస్‌హోల్డు నేమ్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం తుపాన్ ప్రభావిత ప్రాంతాల బాధితుల సమస్యల పరిష్కారానికి మనమిత్ర యాప్‌ సదుపాయాన్ని కల్పించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ల ఆదేశాలతో రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) అధికారులు తుఫాన్ బాధిత ప్రాంతాల్లో మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చారు.

1500కు పైగా సమస్యల షేర్

తుఫాన్ ప్రాంతాల బాధితుల నుంచి విపత్తుల నిర్వహణ సంస్థ ఏర్పాటు చేసిన  కంట్రోల్ రూమ్స్ ఫ్రీ నెంబర్లకు 741కాల్స్ అందితే మనమిత్ర యాప్‌కు 1,500కు పైగా సమస్యలను షేర్ చేయడం గమనార్హం. గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అత్యధిక సమస్యలు అందాయి. త‌మ ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయ‌ని, చెట్లు కూలాయని, కరెంటు పున‌రుద్ధరించాలని, ఆహారం అందజేయాల‌ని, మెడిసిన్స్ కావాల‌ని, ఇత‌ర‌త్రా ప‌లు ర‌కాల స‌మ‌స్యలను బాధిత ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి  అత్యవ‌స‌ర సాయం పొందారు. కోన‌సీమ 253, కాకినాడ 247, తూర్పు గోదావ‌రి 101, ప‌శ్చిమ గోదావ‌రి 159, విశాఖ‌ప‌ట్నం 239, శ్రీకాకుళం 82 స‌మ‌స్యలకు జనం పరిష్కారాన్ని కోరారు. ఆర్టీజీ కార్యద‌ర్శి కాటంనేని భాస్కర్‌, సీఈఓ ప్రఖార్ జైన్‌ మనమిత్ర యాప్‌కు వచ్చిన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చిన సమస్యను వచ్చినట్లుగా 95 శాతం సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేలా పర్యవేక్షించడంతో మనమిత్ర సూపర్ సక్సెస్‌గా నిలిచి జనమిత్రగా ప్రశంసలందుకుంది.