

1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రుల మార్పులు ఎన్నో మలుపులు తిరిగాయి. కొన్ని మార్పులు ఎన్నికల ఫలితాల కారణంగా జరిగితే.. మరికొన్ని మాత్రం అసెంబ్లీ పదవీకాలం పూర్తికాకముందే చోటుచేసుకున్నాయి. కేంద్ర నాయకత్వం ఒత్తిడి, ప్రాంతీయ ఉద్యమాలు, పార్టీలో అంతర్గత విభేదాలు, న్యాయస్థానాల వ్యాఖ్యలు, ఆరోగ్య కారణాలు, రాజకీయ సంక్షోభాలు.. ఇలా ఒక్కో ముఖ్యమంత్రి రాజీనామా వెనుక ఒక్కో కథ ఉంది. మరి ఎన్నికల్లో ఓడిపోకుండా మధ్యలోనే పదవిని వదిలిన ముఖ్యమంత్రులు ఎవరు? వారి రాజీనామాకు దారితీసిన పరిస్థితులేంటి? రాజీనామా తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? ఇదే ఈ రాజకీయ టైమ్‌లైన్ కథనం..
నీలం సంజీవరెడ్డి
1956 నవంబర్ 1న ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన తొలి దశ పదవీకాలం 1960 జనవరి 11 వరకు కొనసాగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడిగా ఎంపికవ్వడంతో 1960 జనవరి 11న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే రోజున (1960 జనవరి 11న) దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
నీలం సంజీవరెడ్డి..రెండో సారి
నీలం సంజీవరెడ్డి 1962, మార్చి 12న రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కర్నూలు ప్రాంతంలో బస్సు రూట్ల జాతీయీకరణ ప్రక్రియలో ముఖ్యమంత్రి వ్యక్తిగత పక్షపాతం చూపారంటూ వచ్చిన ఆరోపణలపై 1964 జనవరిలో సుప్రీంకోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఆయన 1964 ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం 1964 ఫిబ్రవరి 21న ఆయన స్థానంలో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మధ్యంతరంగా రెండుసార్లు సీఎం పదవికి రాజీనామా చేసిన అరుదైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
కాసు బ్రహ్మానందరెడ్డి
కాసు బ్రహ్మానందరెడ్డి దాదాపు ఏడున్నరేళ్లు 194, 21 ఫిబ్రవరి 1964 నుంచి 1971, సెప్టెబంర్ 30 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రాంతీయ అసంతృప్తి, రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. 1971లో తెలంగాణ సమస్యపై కేంద్ర నాయకత్వంతో ఆయనకు భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీంతో 1971 సెప్టెంబర్ 15న రాజీనామా చేశారు. తదనంతరం 1971 సెప్టెంబర్ 30న పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పి.వి. నరసింహారావు
పి.వి. నరసింహారావు 1971 సెప్టెంబర్ 30న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రాంతీయ రాజకీయాలు తీవ్రంగా కొనసాగాయి. 1972లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కూడా ఉధృతమైంది. రెండు ప్రాంతాల్లోనూ రాజకీయ పరిస్థితులు సంక్లిష్టంగా మారడంతో ఆయన ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంది. చివరకు 1973 జనవరి 10న ఆయన పదవి నుంచి వైదొలిగారు. అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది.
మర్రి చెన్నారెడ్డి
1978 మార్చి 6న మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో ప్రాంతీయ రాజకీయాలు, కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, పరిపాలనపై విమర్శలు కొనసాగాయి. 1980లో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రంలో రాజకీయ మార్పు అవసరమని భావించింది. ఈ నేపథ్యంలో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కోరింది. దీంతో 1980 అక్టోబర్ 10న ఆయన రాజీనామా చేశారు. అదే రోజున కేంద్రమంత్రిగా ఉన్న టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
టంగుటూరి అంజయ్య
టంగుటూరి అంజయ్య 1980 అక్టోబర్ 11న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొన్నాళ్లకు ఆయన ప్రభుత్వంపై కాంగ్రెస్‌లోనే అంతర్గత అసంతృప్తి పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురైన ప్రతికూల ఫలితాలు కూడా ఆయన నాయకత్వంపై ఒత్తిడిని పెంచాయి. ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నాయకత్వ మార్పు నిర్ణయం తీసుకుంది. ఇందిరాగాంధీ సూచనల మేరకు అంజయ్య రాజీనామాకు సిద్ధమయ్యారు. 1982 ఫిబ్రవరి 24న ఆయన పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో అదే రోజు భవనం వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
భవనం వెంకటరామిరెడ్డి
భవనం వెంకటరామిరెడ్డి 1982 ఫిబ్రవరి 24న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ప్రభుత్వం కూడా ఎక్కువకాలం కొనసాగలేదు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తనకు తగినంత నియంత్రణ లేదని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. మరోవైపు ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ వేగంగా ప్రజాదరణ పొందుతోంది. ఈ రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం మరోసారి ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం తీసుకుంది. 1982 సెప్టెంబర్ 19న భవనం వెంకటరామిరెడ్డి పదవి నుంచి వైదొలిగారు. అనంతరం 1982 సెప్టెంబర్ 20న కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
నాదెండ్ల భాస్కరరావు
ఇది సాధారణ రాజీనామా కంటే 1984 ‘ఆగస్టు సంక్షోభం’గా చరిత్రలో నిలిచిన రాజకీయ పరిణామం. 1984 ఆగస్టు 16న గవర్నర్ ఠాకూర్ రామ్‌లాల్ ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించారు. అయితే ఆయనకు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెజార్టీ నిరూపించుకోలేక చివరకు 1984 సెప్టెంబర్ 16న నాదెండ్ల భాస్కరరావు పదవి నుంచి వైదొలగగా, అదే రోజు ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
మర్రి చెన్నారెడ్డి..రెండోసారి
1989 డిసెంబర్ 3న రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మర్రి చెన్నారెడ్డి పదవీకాలం సుమారు ఏడాదికే ముగిసింది. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న మతపరమైన అల్లర్లు, శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఆయన నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పరిస్థితులకు రాజకీయ బాధ్యత వహిస్తూ చెన్నారెడ్డి 1990 డిసెంబర్ 17న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే రోజున ఆయన స్థానంలో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి
నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి 1990 డిసెంబర్ 17న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో మతపరమైన ఉద్రిక్తతలను అదుపు చేయడం, నక్సలైట్ కార్యకలాపాలను ఎదుర్కోవడం వంటి అంశాలు ప్రధాన సవాళ్లుగా నిలిచాయి. ఆయన హయాంలో మంజూరు చేసిన ప్రైవేటు మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల అనుమతులలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ అనుమతులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ప్రభుత్వంపై తీవ్రమైన ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. ప్రత్యర్థి వర్గాలు ఈ తీర్పును అస్త్రంగా చేసుకుని ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. కోర్టు తీర్పు, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు నైతిక బాధ్యత వహిస్తూ 1992 అక్టోబరు 9న ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అదే రోజు కోట్ల విజయభాస్కరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఎన్టీ రామారావు
1994 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎన్టీ రామారావు మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 1995లో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. అప్పటి ఆర్థిక మంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధిక శాతం మంది ఎమ్మెల్యేలు సీఎం ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా నిలబడ్డారు. దీంతో 1995 ఆగస్ట్ 31న ఆయన ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేశారు. 1995 సెప్టెంబర్ 1న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది ఎన్నికల ఓటమి వల్ల జరిగిన మార్పు కాదు; పార్టీ అంతర్గత అధికార పోరుతో జరిగిన మధ్యంతర అధికార మార్పు.
కొణిజేటి రోశయ్య
వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలంలో తెలంగాణ ఉద్యమం, రాజకీయ ఒత్తిళ్లు, పరిపాలనా సవాళ్లు తీవ్రంగా ఉన్నాయి. 2010లో కాంగ్రెస్ అధిష్ఠానం నాయకత్వ మార్పుపై ఆలోచనలు ప్రారంభించింది. రోశయ్య మాత్రం తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలు, వయసు, అధిక పని భారం కారణమని స్వయంగా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి పదవి నుంచి తప్పుకోవాలనే తన నిర్ణయాన్ని తెలియజేశారు. 2010 నవంబర్ 24న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2010 నవంబర్ 25న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి 2010 నవంబర్ 25న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కిరణ్ హయాంలో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఏర్పాటు అంశం కీలకమైంది. తెలంగాణ ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. 2014 ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. అనంతరం 2014 మార్చి 1న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
ఎన్టీఆర్ ఎపిసోడ్..ఆసక్తికరం
1984 ఆగస్టు 16న నాటి గవర్నర్ రామ్‌లాల్, ఎన్.టి. రామారావును అక్రమంగా పదవి నుంచి తొలగించి నాదెండ్ల భాస్కరరావును సీఎంగా నియమించారు. అయితే నాదెండ్ల భాస్కరరావు శాసనసభలో మెజారిటీ నిరూపించుకోలేక 1984 సెప్టెంబరు 16న రాజీనామా చేశారు. దీంతో గవర్నర్ శంకర్ దయాళ్ శర్మ ఎన్టీఆర్‌ను తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. అదే రోజు ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటికీ, సంక్షోభం సృష్టించిన రాజకీయ ఆందోళనలకు స్వస్తి చెప్పి, ప్రజల వద్దకే నేరుగా వెళ్లి తాజా ప్రజా తీర్పు (Fresh Mandate) కోరాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. అందుకోసం 1984 నవంబరులోనే శాసనసభ రద్దుకు సిఫార్సు చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వం సాధారణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది. 1985 మార్చి 5న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 202 స్థానాల్లో ఘనవిజయం సాధించి తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 1985 మార్చి 9న ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 1989 డిసెంబరు 2 వరకు కొనసాగారు. కాబట్టి 1984 సెప్టెంబరు 16 నుంచి 1985 మార్చి 9 వరకు ఉన్న ఈ 6 నెలల కాలాన్ని రాజీనామా సంక్షోభంగా కాకుండా, "ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనంతరం ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా నూతన ప్రజా తీర్పు పొందే వరకు కొనసాగిన సంక్రమణ/మధ్యంతర దశ (Transitional Phase)"గా పరిగణించాలి.
58 ఏళ్లలో..12 సందర్భాలు
1956 నవంబర్ 1 నుంచి 2014 జూన్ 2 వరకు సాగిన 58 ఏళ్ల చరిత్రలో ఎన్నికల ఓటమిని పక్కనపెట్టి మధ్యంతరంగా ముఖ్యమంత్రి పదవులు మారిన ప్రధాన సందర్భాలు సుమారు 12గా ఉన్నాయి. ఇందులో నీలం సంజీవ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి రెండు సార్లు రాజీనామా చేయడం విశేషం. రాజీనామాల అనంతరం నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.