రాప్తాడు దారుణం..రంపంతో పదో తరగతి బాలికపై ఉన్మాది దాడి

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థినిపై ఓ ఉన్మాది రంపంతో విచక్షణారహితంగా దాడిచేసి ముఖం, మెడ, చేతులను ఛిద్రం చేశాడు.
Rapthadu School Attack Case
అనంతపురం జిల్లా రాప్తాడులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి
Published on: 

ప్రభాత ఉదయం, అమరావతి : చదువుల తల్లి ఒడిలో పాఠాలు వింటున్న ఓ అభాగ్యురాలి కలలపై మృగరూపంలో వచ్చిన ఉన్మాదం రంపంలా విరుచుకుపడింది. ఉన్నత స్థాయికి ఎదగాల్సిన భవిష్యత్‌ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడింది. ఆమె ఆర్తనాదాలు, తరగతి గది గోడలను తాకిన రక్తపు చారికలు గుండెలను కలచివేస్తున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం చోటుచేసుకున్న ఈ కిరాతక దాడి సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పాఠాలు వింటున్న పదోతరగతి విద్యార్థినిపై ఓ ఉన్మాది రంపంతో విచక్షణారహితంగా దాడిచేసి ముఖం, మెడ, చేతులను ఛిద్రం చేశాడు. తోటి స్నేహితురాలి ప్రాణాలను కాపాడాలని ప్రాణాలకు తెగించి ఎదుర్కోవడానికి ప్రయత్నించిన మరో చిన్నారి కూడా ఉన్మాద దాడిలో గాయాలపాలైంది. పవిత్రమైన విద్యాలయంలో కన్నబిడ్డల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్న చేదు నిజం యావత్ రాష్ట్రాన్ని కన్నీటి సంద్రంలో ముంచెత్తింది.

ఈ పాశవిక దాడి తర్వాత ఆ ఉన్నాది అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడిఉన్న బాధిత బాలికలను ఉపాధ్యాయులు, తోటి స్నేహితులు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరిన బాధిత చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని చూసిన వారికి కన్నీరు ఆగలేదు. వైద్యులు వారిని వెంటనే ఐసీయూ చేర్చి వైద్యం అందించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మంత్రి సత్యకుమార్ పర్యవేక్షణలో బెంగళూరుకు తరలించారు. పారిపోతున్న ఉన్మాదిని ధర్మవరం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ధర్మవరం మండలం నాగలూరు గ్రామానికి చెందిన హేమంత్‌గా గుర్తించారు. అతడు బాధిత బాలికకు దూరపు బంధువేనని, కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

 సీఎం చంద్రబాబు పరామర్శ

దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థిని తల్లితో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, బాలికను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. విద్యార్థినికి అందుతున్న వైద్యం సాయంపై వైద్యులను ఆరా తీశారు. దాడిలో గాయపడిన మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలెక్టర్‌తో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత ఆస్పత్రికి చేరుకుని బాలికల కుటుంబ సభ్యులను ఓదార్చారు.