

‘ఎస్ఐఆర్’ పూర్తికాకున్నా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం
వైఎస్సార్ సీపీకి ఎదురుదెబ్బ
బీసీ రిజర్వేషన్లపై ఏపీ సర్కారు పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు శుక్రవారం పచ్చజెండా ఊపింది. ఈ ఆదేశంతో వైఎస్సార్ సీపీకి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలంటూ వైఎస్సార్ సీపీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్థానిక ఎన్నికలకు, ఎస్ఐఆర్ ప్రక్రియతో లంకె పెడుతూ ఆ పార్టీ లేవనెత్తిన ఏ అంశాన్నీ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రంలో వార్డుల పునర్విభజనను సవాలు చేస్తూ వైఎస్సార్ సీపీ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఈ పిటిషన్ ప్రజాప్రయోజనాలకు విరుద్ధం
‘‘ఎన్యూమరేటర్లకు, కేంద్ర ప్రభుత్వానికి లేని ఇబ్బంది వైఎస్సార్ సీపీకి ఎందుకు వస్తోంది ? స్థానిక సంస్థల ఎన్నికలను కావాలనే వాయిదా వేయించాలనే దురుద్దేశం ఈ పిటిషన్లో కనిపిస్తోంది. ఇలా చేయడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధం” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్థానిక ఎన్నికల విషయంలో గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం ఆరు వారాల్లోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు తాము సిద్ధమని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తయితే ఆ జాబితాను తీసుకోవాలని, పూర్తికాకుంటే పాత జాబితా ప్రకారమే ఎన్నికలను నిర్వహించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఎన్నికల నిర్వహణలో ఆలస్యానికి తావులేకుండా చూడాలని ఆదేశించింది.
బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ కొట్టివేత
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చింది. 34 శాతం కోటాతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయని వ్యాఖ్యానించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ అంశంలో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం నిరాకరించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదికను అమలు చేస్తున్నట్లు ఎక్కడుందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఏపీ సర్కారును ప్రశ్నించింది.