

న్యూఢిల్లీ: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. కేసు విచారణ చివరిదశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. కేసు చివరిదశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లుథ్రా వాదించారు. 87 మంది సాక్షుల్లో చాలామందిని ఇప్పటికే విచారించామని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ దశలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని వివరించారు. మరోవైపు ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ.. ట్రయల్ నెమ్మదిగా చేయాలని కోరారు. విచారణ వేగంగా పూర్తి చేస్తుండటం వల్ల తన వాదనలు సమర్థంగా వినిపించుకోలేకపోతున్నామని ఆమె కోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు స్పందిస్తూ ట్రయల్ నెమ్మదిగా జరపాలని అడిగే హక్కు నిందితురాలికి లేదని స్పష్టం చేసింది.