టీటీడీలో ఇక అధికారుల పాలన.. స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా ఈవో ముద్దాడ రవిచంద్ర

టీటీడీ ట్రస్టు బోర్డు పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక సాధికారిత మండలిని ఏర్పాటు చేసింది.
Muddada Ravichandra taking charge as chairman of the TTD Specified Authority
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర
Published on: 

ప్రభాత ఉదయం, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ట్రస్టు బోర్డు రెండేళ్ల కాలపరిమితి ముగిసింది. దీంతో టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆధ్వర్యంలోని పాలక మండలి స్థానంలో స్పెసిఫైడ్‌ అథారిటీ (ప్రత్యేక సాధికారిత మండలి)ని ప్రభుత్వం ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. ముగ్గురు ఐఏఎస్ అధికారులు టీటీడీ ఈవో ముద్దాడ రవీచంద్రను అథారిటీ చైర్మన్‌గా, సభ్యులుగా ఆర్థికశాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌, దేవదాయశాఖ కార్యదర్శి కన్నబాబును నియమించింది. శుక్రవారం స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా ప్రస్తుత టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవుని సేవ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలికి ఉండే అన్ని అధికారాలు, విధులను స్పెసిఫైడ్ అథారిటీ నిర్వహించనుంది. నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యే వరకు లేదా ఏడాది పాటు ఈ అథారిటీ కొనసాగనుంది.

కొత్త పాలక మండలి భర్తీకి కసరత్తు

టీటీడీ నూతన పాలక మండలి చైర్మన్ పదవి కోసం కూటమి నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు, జగ్గంపేట ఎమ్మెల్యే, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ, పారిశ్రామిక వేత్తలు సీఎం రవిశంకర్, ఎన్నారై శ్రీనివాస రామానుజం పేర్లు ప్రచారంలో ఉన్నాయి. చైర్మన్ ఎంపికలో ప్రాంతీయ, సామాజిక సమీకరణలు ప్రభావం చూపనుండటంతో, సీఎం చంద్రబాబు నిర్ణయం ఏలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.