యలహంక ప్యాలెస్ నాదే : వైఎస్‌ షర్మిల

బెంగళూరులోని యలహంక ప్యాలెస్ తనదేనని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అయితే కుటుంబ వివాదం నేపథ్యంలో కుమార్తె అంజిలి వివాహ వేదికను మార్చినట్లు వెల్లడించారు.
Ys Sharmila Announces changing of daughters wedding venue
వైఎస్​ షర్మిల
Published on: 

ప్రభాత ఉదయం, అమరావతి : బెంగళూరులోని యలహంకలో ఉన్న ప్యాసెల్​ తనదేనని ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల తెలిపారు. నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు అని శనివారం ఆమె ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు.‘వైఎస్​ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. అప్పటివరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా 100 శాతం నాకు, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం’ అని ఆమె పేర్కొన్నారు. ‘ ఆ ఆస్తి నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న వైఎస్​ఆర్​ తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్టుగా తన వివాహం అక్కడే చేయాలనుకున్నాం. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టం. కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం. నా కుమార్తె అంజిలి పెళ్లి పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాదరహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డి పెళ్లి వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం’ అని షర్మిల తన పోస్టులో పేర్కొన్నారు. అయితే, కొత్త వేదిక ఎక్కడ అనేది మాత్రం ఆమె ప్రస్తావించలేదు. బెంగళూరు యలహంకలోని విశాలమైన ప్యాలెస్​లో నవంబరు 25న తన కూతురు పెళ్లి జరిపించాలని షర్మిల నిర్ణయించారు. సెప్టెంబర్​ 24న నిశ్చితార్థం జరిగింది. ఆహ్వాన పత్రికల్లో కూడా యలహంక చిరునామా ముద్రించి బంధుమిత్రులకు పంపించారు. అయితే, భద్రత, గోప్యత కారణాలు చూపి షర్మిల సోదరుడు, ఏపీ మాజీ సీఎం జగన్‌ అక్కడ పెళ్లికి అనుమతి నిరాకరించారు. తన నివాస ప్రాంగణంలో పెద్ద ఎత్తున అతిథులు, సిబ్బంది తిరగడం వల్ల సమస్యలు తలెత్తుతాయని ఆయన సోదరికి లేఖ రాశారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ నివాసాన్ని ప్రత్యామ్నాయంగా సూచించారు. అయితే, ఈ వివాదం మరింత ముదరకుండా షర్మిల తన కూతురు వివాహ వేదికను మార్చుకున్నారు.