వెటరన్ కారుకు మెరిసే రంగులు, విద్యుత్ హంగులు

పారిస్ ఆటో షోలో సిట్రోయెన్ ఆవిష్కరించిన రెట్రో డిజైన్ ఎలక్ట్రిక్ మినీ కారు ప్రత్యేకతలు ఆసక్తి రేపుతున్నాయి. 2028 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
Citroen Mini Electric Car
Citroen Mini Electric Car Unveiled At Paris Auto Show
Published on: 

పారిస్: పారిస్ ఆటో షో వేదికగా ప్రపంచం ముందుకు వచ్చిన ఓ చిన్నారి కారు ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎంతో ఆదరణ పొందిన పాత డిజైన్‌కు ఆధునిక సాంకేతికతను జోడించింది సిట్రోయెన్ కంపెనీ. సరికొత్త టెక్నాలజీలతో ఎలక్ట్రిక్ కారును సంస్థ ఆవిష్కరించింది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా తక్కువ ధరలో ఈ వాహనాన్ని తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. భారీ కార్ల సంస్కృతికి చెక్ పెడుతూ కేవలం 1000 కిలోల బరువు, 15 వేల యూరోలతో ఈ మినీ కారు రూపుదిద్దుకుంది. 2028 నాటికి రోడ్లపైకి రానున్న ఈ వాహనం విశేషాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

 ఆకట్టుకునే డిజైన్.. సరికొత్త హంగులు

3 దశాబ్దాల కిందటి ప్రసిద్ధ కారు ఆకృతిని పోలి ఉండే ఈ చిన్ని వాహనం చూడగానే మురిపించేలా ఉంటుంది. కేవలం 3.76 మీటర్ల పొడవుతో ఉండే ఈ కారు పట్టణ ప్రాంతాల్లో తిరగడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. పాత కాలపు జ్ఞాపకాలను గుర్తుచేసేలా ప్రత్యేకమైన రంగులు, గుండ్రని హెడ్‌లైట్లు దీని ప్రత్యేకత. కప్పు భాగంలో ఉండే ఫ్యాబ్రిక్ సన్‌రూఫ్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. కేవలం బాహ్య రూపమే కాకుండా లోపల కూడా వినూత్నమైన డిజైన్‌ను అమర్చారు. అందరినీ ఆకట్టుకునేలా క్యాబిన్ లోపలి భాగం పిల్లల ఆటవస్తువులను తలపించేలా రూపుదిద్దుకుంది. కార్టూన్ చిత్రాలను పోలిన స్క్రీన్ గ్రాఫిక్స్, సీలింగ్‌కు వేలాడదీసిన లాంతర్లు విభిన్న అనుభూతిని ఇస్తాయి. కేవలం ప్రయాణం మాత్రమే కాకుండా ఈ కారును నడుపుతున్నంత సేపు వినూత్నమైన అనుభూతి కలిగేలా సిట్రోయెన్ ఇంజినీర్లు డిజైన్ చేశారు.

 భవిష్యత్ ప్రయాణమే లక్ష్యంగా తయారీ

ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాత చిన్న కార్ల సెగ్మెంట్‌లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రముఖ టైర్ల తయారీ సంస్థతో కలిసి ఈ కారుకు ప్రత్యేకమైన డిజిటల్ టెక్నాలజీని జోడించారు. టైర్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వాహనం వేగాన్ని నియంత్రించే సరికొత్త విధానాన్ని ఇందులో పొందుపరిచారు. సాధారణ ప్రజలకు తక్కువ ఖర్చుతో కూడిన ఆధునిక ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కంపెనీ అడుగులు వేస్తోంది. కానీ 15 వేల యూరోలంటే మన కరెన్సీలో అది దాదాపు రూ. 15 లక్షలుగా ఉంటుంది. మరి టాటా నానోతో పోల్చుకుంటే..మాత్రం మనవాళ్లు అంత నచ్చకపోవచ్చు.