‘ఈ‌‌–ముద్ర’లో లీక్​ కలకలం.. అసలేమైంది ?

'ఈ-ముద్ర'లో 8 ప్రైవేట్ సెక్యూరిటీ కీలు లీక్ అవ్వడం సంచలనం రేపింది. దీంతో స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేరు విలువ 20% పతనమై రూ.345.60కు పడిపోయింది.
eMudhra Private Key Leak
eMudhra Private Key Leak
Published on: 

ముంబై: ఆధార్​ (యూఐడీఏఐ), ఆదాయం పన్నుశాఖ వంటి అనేక ప్రభుత్వ వెబ్‌సైట్లు తమ భద్రత కోసం ‘ఈ-ముద్ర’ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు, ఈ–సైన్​లనే ఉపయోగిస్తాయి. వెబ్‌సైట్లు, సాఫ్ట్‌వేర్స్​ భద్రత కోసం గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్, యాపిల్ సఫారీ వంటి వెబ్ బ్రౌజర్లు నమ్మే డిజిటల్ సర్టిఫికెట్లనూ ఈ సంస్థ జారీ చేస్తుంటుంది. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ఈ-ముద్ర సంస్థకు చెందిన 8 ప్రయివేట్ కీస్ (సెక్యూరిటీ కోడ్స్) లీక్​ కావడం కలకలం రేపింది. దీంతో గురువారం రోజు భారత స్టాక్​ మార్కెట్​లలో ఈ-ముద్ర షేర్​ విలువ 20 శాతం పడిపోయి రూ.345.60కు చేరింది. ఇంతలా కుదిపేసే రేంజ్​లో సెక్యూరిటీ కోడ్స్ లీక్ ఎలా జరిగింది ? దీనివల్ల జరిగే నష్టమేంటి ?  లీక్​ ఫలితంగా ఎదురైన ప్రతికూల పర్యవసానాలేంటి ? ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రయివేటు ​ కీ అంటే ఏమిటి ?

ఇంటర్నెట్‌లో మనం ఒక వెబ్‌సైట్​ను ఓపెన్ చేసినప్పుడు, అది అసలైన సైట్ అని, నకిలీది కాదని ధృవీకరించడానికి ‘ఈ-ముద్ర’ వంటి సంస్థలు డిజిటల్ సర్టిఫికెట్లను ఇస్తాయి. ఈ సర్టిఫికెట్లకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక "పబ్లిక్ కీ" (అందరికీ కనిపించే తాళం)తో పాటు ఒక "ప్రయివేటు కీ" (రహస్యంగా ఉండే తాళంచెవి) ఉంటాయి. ఈ రహస్య తాళంచెవి (ప్రయివేట్​ కీ) అనేది ఎవరూ ఊహించలేనంత పెద్ద సంఖ్యలతో కూడిన కోడ్‌తో (సుమారు 116 అంకెలతో) ఉండాలి.

కీ లీక్​ ఇలా జరిగింది

2025 ఏప్రిల్​లో ఈ-ముద్ర సంస్థ ప్రయివేట్​ సెక్యూరిటీ కీల సాఫ్ట్​వేర్​ను​ రాసేటప్పుడు ఒక మానవ తప్పిదం జరిగింది. దీనివల్ల అత్యంత బలమైన కోడ్‌కు బదులుగా చాలా బలహీనమైన, సులభంగా ఊహించగలిగే కోడ్‌లు తయారయ్యాయి. ఎంతలా అంటే, ఈ ఎనిమిది ప్రయివేట్ కీలలో ఒక కీ యొక్క రహస్య కోడ్ విలువ కేవలం ఒంటరి అంకె ‘4’. మిగిలినవి కూడా కేవలం రెండు లేదా మూడు అంకెల చిన్న సంఖ్యలే. దీనివల్ల ఒక సెక్యూరిటీ రీసెర్చర్ పబ్లిక్ డేటాను తనిఖీ చేస్తున్నప్పుడు, ఒక్క సెకను కంటే తక్కువ సమయంలోనే మ్యాథమెటికల్ పద్ధతిలో ఆ రహస్య కీలను (ప్రయివేట్ కీస్) కనిపెట్టగలిగారు. దీన్నే సాంకేతికంగా ‘కీ లీక్’ అని పిలుస్తారు.

ఈ–ముద్ర వాదన ఇదీ

‘‘మా మెయిన్ కంప్యూటర్ నెట్‌వర్క్‌పై ఎలాంటి సైబర్ దాడి జరగలేదు. డేటా చోరీ కూడా జరగలేదు. కోడింగ్ పొరపాటు వల్లే కీలు బలహీనపడ్డాయి. లీకైన ఎనిమిది ఇంటర్మీడియట్ కీలలో ఒకే ఒక్క కీ ప్రస్తుతం వాడకంలో ఉంది. మిగిలిన ఏడు కీలను ఎవ్వరూ ఉపయోగించలేదు. వీటి ద్వారా మా వినియోగదారులకు ఎలాంటి తప్పుడు సర్టిఫికెట్లు జారీ కాలేదు. బాధిత కీలకు సంబంధించిన గ్లోబల్ సర్టిఫికెట్లను వాడుతున్న సుమారు 30,000 మంది అంతర్జాతీయ వినియోగదారులను ఇతర సురక్షితమైన రూట్ నెట్‌వర్క్‌కు మారుస్తున్నాం” అని ఈ-ముద్ర వెల్లడించింది.

కీస్​ లీక్​ నేపథ్యంలో అంతర్జాతీయ వెబ్‌సైట్ సర్టిఫికెట్ల జారీ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్లు ఈ-ముద్ర సంస్థ తెలిపింది. భారతదేశంలో తమ అన్ని సేవలు యధాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

బ్రౌజర్లు బ్లాక్​ చేసిన పర్యవసానం

లీకైన ప్రయివేట్​ కీలు హ్యాకర్ల చేతికి చిక్కితే దొంగ వెబ్‌సైట్లను సృష్టించి, వాటికి ఈ కీల సహాయంతో "అసలైన వెబ్‌సైట్" ట్యాగ్​తో నకిలీ సర్టిఫికెట్లను సులభంగా తయారు చేసుకుంటారు. వినియోగదారులు ఆ నకిలీ సైట్‌ను నిజమైన సైట్ అనుకుని మోసపోతారు. బ్రౌజర్లు కూడా దాన్ని సురక్షితమైన సైట్‌గా చూపిస్తాయి. దీని ద్వారా యూజర్ల పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ వివరాలను హ్యాకర్లు దొంగిలించే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో గూగుల్ క్రోమ్, మొజిల్లా, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి బ్రౌజర్లు వెంటనే ఆ 8 కీలను పూర్తిగా బ్లాక్ చేశాయి. ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని భారత ఐటీ శాఖ గురువారం  ప్రకటించింది. ఈ ప్రతికూల పరిణామాల ప్రభావంతో గురువారం స్టాక్ మార్కెట్​లలో ఈ-ముద్ర షేర్​ విలువ 52 వారాల కనిష్ఠ స్థాయికి పతనమైంది.