

ముంబై: బంగారం ధర ఇంకా తగ్గుతుందా ? లేదంటే, మళ్లీ రేటు రెక్కలు తొడుగుతుందా ? అనే డైలమాలో ప్రజానీకం ఉన్నారు. కర్వా చౌత్ (అక్టోబర్ 29), ధన త్రయోదశి (నవంబర్ 6), దీపావళి (నవంబర్ 8) వంటి శుభవేళల్లో బంగారం కొనాలనే సెంటిమెంట్ చాలామందికి ఉంటుంది. ఇక వచ్చే పెళ్లిళ్ల సీజన్ (నవంబర్ – డిసెంబర్)లో గోల్డ్ సేల్స్ ఎలాగూ పెరుగుతాయి. గత 10 నెలల్లో పసిడి రేటు రూ.38,600 దాకా పడిపోయిన నేపథ్యంలో బంగారం ఇప్పుడే కొనాలా ? ఇంకొన్నాళ్లు ఆగి కొనాలా ? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం జనం అన్వేషిస్తున్నారు.
జనవరిలో ఆల్ టైమ్ గరిష్ఠానికి
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు (గత 10 నెలల్లో) స్వర్ణం ధర 10 గ్రాములకు దాదాపు రూ.38,600 దాకా పడిపోయింది. జనవరిలో రూ.1,80,779 ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకిన గోల్డ్ రేటులో తగ్గుదల ఫిబ్రవరి మూడో వారం నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 17 నాటికి 24 క్యారెట్ల బంగారం ధర మొదటిసారి రూ.1,55,190కి పడిపోయింది. ఆ తర్వాత మార్కెట్ ఒడిదొడుకుల మధ్య కొన్ని నెలలు పెరిగినా, ప్రధానంగా జూన్-జూలై, ప్రస్తుత అక్టోబర్ నెలల్లో అత్యంత భారీ పతనాన్ని చవిచూసింది. జూన్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,46,392కి చేరగా, జూలైలో మరింత తగ్గి రూ.1,48,809 వద్ద ఈ ఏడాది కనిష్ఠ స్థాయిని తాకింది. ఆగస్టులో మళ్లీ ఊపందుకొని రూ.1,67,370 మార్కును దాటిన పసిడి రేటు, సెప్టెంబర్ చివరి వారం నుంచి తిరిగి పతనం బాట పట్టింది.
ఈ నెలలోనే రూ.7వేలు డౌన్
బంగారం ధర ఈ నెలలోనూ(అక్టోబర్) భారీగానే దిగివచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రాములు) రేటు ఈనెల 1న హైదరాబాద్లో రూ.1,49,240 వద్ద ఉండగా, అది 9వ తేదీ నాటికి రూ.1,51,700 గరిష్ఠ స్థాయిని టచ్ చేసింది. అక్టోబరు 23న (శుక్రవారం) ఒకానొక దశలో స్వర్ణం ధర రూ.1,41,334 కనిష్ఠ స్థాయికి చేరింది. ఇక తాజాగా అక్టోబరు 26 (సోమవారం) నాటికి రూ.1,42,580 వద్ద రేటు కదలాడుతోంది. మొత్తంగా ఈ నెల రోజుల వ్యవధిలో పసిడి ధర దాదాపు రూ.7వేల దాకా డౌన్ అయింది. ముఖ్యంగా అక్టోబర్ రెండో వారంలో అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో గోల్డ్ రేటు వేగంగా పతనమైంది.
అమెరికా సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం కీలకం
పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారు ఆభరణాలు కొనాలని భావించే వారికి ప్రస్తుత ధరలు సరైనవేనని బులియన్ మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. కానీ, రేటు ఇంకా తగ్గిపోదనే గ్యారంటీని ఎవ్వరూ ఇవ్వరని తేల్చి చెబుతున్నారు. అయితే పెద్ద ఎత్తున బంగారంలో పెట్టుబడి పెట్టాలని భావించే వారు ఈ వారంలో చోటుచేసుకునే పలు పరిణామాలను నిశితంగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ పాలసీ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశం జరగనుంది. ఇందులో తదుపరి వడ్డీ రేట్ల విధానంపై కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. సమావేశం ముగిశాక, భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 29న ఉదయం ఫెడ్ దీనిపై ప్రకటన విడుదల చేస్తుంది. ద్రవ్యోల్బణ పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, అమెరికా డాలర్ విలువ కొంత బలహీనపడుతుంది. అమెరికా ప్రభుత్వ బాండ్ల ద్వారా వచ్చే లాభాలు స్వల్పంగా తగ్గుతాయి. ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరిగి, ధరలు పైకి కదులుతాయి.
అందరి చూపు.. ముడి చమురు వైపు
ప్రస్తుతం 1 బ్యారెల్ ముడి చమురు (బ్రెంట్ క్రూడ్) ధర 114.50 –115.10 డాలర్ల రేంజ్లో ఉంది. రష్యా నుంచి ప్రపంచ దేశాలకు ముడి చమురు సప్లయ్ మళ్లీ మొదలుకావడం అనే అంశం ఈవారంలో చమురు ధరల తగ్గుదలకు దారితీయొచ్చు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు ఇంకోసారి తీవ్రరూపు దాలుస్తాయనే ప్రచారం జరుగుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆ దిశగానే సంకేతమిస్తున్నాయి. అదే జరిగితే చమురు ధరలు పెరుగుతాయి. ఫలితంగా రవాణా ఖర్చులు, నిత్యావసరాల ధరలు, ఉత్పాదక వ్యయం పెరిగి ద్రవ్యోల్బణం హెచ్చుతుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కరెన్సీ విలువ పడిపోతుంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు తమ సంపద విలువ తగ్గకుండా కాపాడుకోవడానికి బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించి కొంటారు. పర్యవసానంగా గోల్డ్ రేట్లు పెరుగుతాయి.