ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులతో దేశాభివృధ్ధి

ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులతో పట్టణ అభివృద్ధికి కేంద్రం వినూత్న ప్రణాళికలు. బ్యాంకోబుల్ ప్రాజెక్టులపై దృష్టి సారించిన నిర్మలా సీతారామన్.
Nirmala Sitharaman
Nirmala Sitharaman
Published on: 

బ్యాంకాక్: దేశంలోని పట్టణ ప్రాంతాలను ఆర్థికంగా సుస్థిరంగా మలచడంలో పాటు పెట్టుబడులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న విధానాన్ని అనుసరిస్తోంది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాంకు-ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా భారత పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రసంగం చేశారు. నగరాల అభివృద్ధిలో కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌, మెరుగైన మున్సిపల్ ఫైనాన్సెస్, డెవలప్‌మెంట్ ఫైనాన్స్, ప్రైవేట్ క్యాపిటల్ వంటి వివిధ వనరులను ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా నగరాలు స్వయంసమృద్ధి సాధించగలవని పేర్కొన్నారు.

 నగరాల అభివృద్ధికి ప్రణాళికలు

పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిజైన్లు, వాస్తవిక డిమాండ్ అంచనాలు, లైఫ్ సైకిల్ కాస్ట్ ఎస్టిమేట్స్ కలిగి ఉన్న 'బ్యాంకోబుల్ ప్రాజెక్టుల' పై దృష్టి సారించాలని మంత్రి వెల్లడించారు. గత 8-9 ఏళ్ల కాలంలో అమృత్, స్మార్ట్ సిటీస్ మిషన్, స్వచ్ఛభారత్ వంటి జాతీయ కార్యక్రమాల ద్వారా పట్టణ సేవల ఆధునీకరణ వేగవంతమైందని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. దీని కింద లక్ష కోట్ల రూపాయల కేంద్ర సహాయంతో సుమారు రూ. 4 లక్షల కోట్ల మేర మొత్తం పట్టణ పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఛాలెంజ్ మోడ్ ద్వారా నగరాలు పోటీపడి ఈ నిధులను పొందవచ్చని, ఇందుకు పాలనాపరమైన సంస్కరణలు కీలకమని మంత్రి తెలిపారు.

 సిటీ ఎకనామిక్ రీజియన్ విధానం

ఈ ఏడాది ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్ 2026-27లో ప్రభుత్వం 'సిటీ ఎకనామిక్ రీజియన్' విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సంస్కరణలను ప్రాంతీయ వృద్ధికి అనుసంధానిస్తున్నారు. ఒక్కో సిటీ ఎకనామిక్ రీజియన్‌కు ఐదేళ్ల కాలానికి రూ. 5,000 కోట్ల చొప్పున కేటాయిస్తున్నారు. రీజనల్ ప్లానింగ్ ద్వారా భూవినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు సేవల్లో ద్వంద్వ ప్రణాళికలు తొలగిపోతాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. అలాగే జనాభా ఒక లక్ష కంటే తక్కువ ఉన్న పట్టణ స్థానిక సంస్థలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ. 5,000 కోట్ల క్రెడిట్ రీపేమెంట్ గ్యారంటీ సబ్-స్కీమ్‌ అమలు జరుగుతోంది. ప్రజలకు అవసరమైన ప్రాథమిక సేవలను అందించడంలో ప్రభుత్వ నిధులు కీలకంగా ఉంటాయని, అదే సమయంలో ప్రైవేట్ భాగస్వామ్యం ప్రాజెక్టులు వేగంగా పూర్తవడానికి తోడ్పడుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో తెలిపారు.