రిలయన్స్ షేర్లకు జోష్

గరిష్ఠ ధర వద్ద రూ.30,213 కోట్ల సమీకరణ జరిగితే, జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో దేశంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనున్నది.
Reliance Industries Shares increased
Shares of Reliance Industries surged due to announcement of the price range for the Jio Platforms IPO
Published on: 

న్యూఢిల్లీ: జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఐపీవో ధరల శ్రేణిని ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గురువారం భారీగా పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు 4.03 శాతం పెరిగి రూ.1,223.30 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 3.43 శాతం లాభంతో రూ.1,215 వద్ద స్థిరపడింది. ఈ పెరుగుదలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ ఒక్కరోజులో రూ.64,076.57 కోట్లు పెరిగి రూ.16,55,435.46 కోట్లకు చేరింది.

 రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ తన ఐపీవోకు ఒక్కో షేర్‌కు రూ.1,065 నుంచి రూ.1,119 వరకు ధరల శ్రేణిని నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద షేర్లను విక్రయిస్తే కంపెనీ సుమారు రూ.30,213 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. ఈ ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ కలిగిన 27 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 21న ప్రారంభమై, అక్టోబర్ 23న ముగియనున్నది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ అక్టోబర్ 19న జరగనున్నది. జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు ఐపీఓ కమిటీ బుధవారం జరిగిన సమావేశంలో ధరల శ్రేణికి ఆమోదం తెలిపినట్లు రిలయన్స్ నియంత్రణ సంస్థలకు సమర్పించిన పత్రాల్లో స్పష్టం చేసింది.

 దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం

గరిష్ఠ ధర వద్ద రూ.30,213 కోట్ల సమీకరణ జరిగితే, జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో దేశంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనున్నది. 2024లో హ్యుందాయ్ మోటర్ ఇండియా రూ.27,858.75 కోట్ల ఐపీవో ద్వారా నెలకొల్పిన రికార్డును జియో ప్లాట్‌ఫామ్స్ అధిగమించే అవకాశం ఉంది. ఈ మొత్తం హ్యుందాయ్ ఐపీవో కంటే సుమారు 8 శాతం ఎక్కువ. అలాగే, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) రూ.20,557.23 కోట్ల ఐపీవోతో పోలిస్తే దాదాపు 47 శాతం అధికం.

 ఐపీఓలో కీలక తేడా

హ్యుందాయ్ మోటర్ ఇండియా, ఎల్‌ఐసీ ఐపీవోలు ఇప్పటికే ఉన్న వాటాదారులు తమ షేర్లను విక్రయించే ఆఫర్ ఫర్ సేల్ (వోఎఫ్ఎస్) విధానంలో నిర్వహించాయి. అయితే జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో పూర్తిగా కొత్త షేర్ల జారీ ద్వారా చేపట్టనున్నారు. ఇందులో వోఎఫ్‌ఎస్ ఉండదు. దీంతో ఐపీవో ద్వారా సమీకరించే నిధులు నేరుగా జియో ప్లాట్‌ఫామ్స్‌కు చేరనున్నాయి.

 స్టాక్ మార్కెట్లకు ఊతం

రిలయన్స్ షేర్లలో వచ్చిన భారీ లాభాలు దేశీయ స్టాక్ మార్కెట్ల పెరుగుదలకు కూడా తోడ్పడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,533.72 పాయింట్లు, అంటే 2.11 శాతం పెరిగి 74,315.61 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 374.65 పాయింట్లు, అంటే 1.66 శాతం లాభపడి 22,997.35 వద్ద స్థిరపడింది. సెప్టెంబర్ 25 తర్వాత నిఫ్టీకి ఇదే అత్యధిక ముగింపు స్థాయి. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రకటనతో రిలయన్స్ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. రాబోయే రోజుల్లో ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందన్నది మార్కెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.