పెట్రో రేట్లు మళ్లీ పెరుగుతున్నాయా?

అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ధరలు 112 డాలర్లకు చేరడంతో దేశీయ ఇంధన రేట్లు పెరిగే సూచనలు. నిత్యావసరాల ధరలపై ప్రభావం.
Brent Crude Oil Price Surge
Published on: 

న్యూఢిల్లీ : దేశంలో మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సౌదీ అరేబియాపై హూతీల దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు పెరిగాయి. బ్యారెల్‌ ధర 112 డాలర్లు దాటడంతో చమురు దిగుమతులపై ఆధారపడే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలపై వ్యయ భారం పెరుగుతోంది. ఇది దేశ వాణిజ్య లోటును పెంచడంతోపాటు రూపాయి విలువపైనా ఒత్తిడి పెంచుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల సవరణపై నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 నిత్యావసరాల ధరలు

భారత్‌ తన ఇంధన అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరిగితే రవాణా, తయారీ రంగాల ఖర్చులు పెరుగుతాయి. దీంతో ఇంధన ధరలు పెరిగే అవకాశాలున్నాయి. దీనివల్ల దేశీయంగా కూరగాయలు, పాలు, పప్పు దినుసులు వంటి అన్ని రకాల సరుకుల ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌ను తల్లకిందులు చేసే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు శాంతించకపోతే దేశీయంగా చమురు మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. దీర్ఘకాలంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టడం ద్వారా మాత్రమే ఈ దిగుమతి భారాన్ని తగ్గించుకోవడానికి వీలవుతుంది.