టాటా రూ.4,281 కోట్ల పెట్టుబడి.. 10 వేల కి.మీ. ఏఐ నెట్‌వర్క్‌!

టాటా కమ్యూనికేషన్స్‌ దేశవ్యాప్తంగా 10 వేల కిలోమీటర్ల మేర అత్యాధునిక హైస్పీడ్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.4,281 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
Tata Communications to invest $450 million in India AI fibre network
Tata Communications to invest $450 million in India AI fibre network
Published on: 

న్యూఢిల్లీ : టాటా కమ్యూనికేషన్స్‌ ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు భారీ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 10 వేల కిలోమీటర్ల మేర అత్యాధునిక హైస్పీడ్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం రూ.4,281 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. భవిష్యత్తులో పెరగనున్న డిజిటల్‌ అవసరాలను తీర్చడంతోపాటు, ఏఐ ఆధారిత సేవలకు వేగవంతమైన, నమ్మకమైన కనెక్టివిటీ అందించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం.

మూడు దశల్లో నెట్‌వర్క్‌ విస్తరణ

ఈ భారీ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయనున్నారు. తొలిదశలో ముంబై, పుణె, హైదరాబాద్‌, చెన్నై నగరాలను హైస్పీడ్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తారు. అనంతరం విశాఖపట్నం, భువనేశ్వర్‌, జామ్‌నగర్‌, గిఫ్ట్‌ సిటీ ప్రాంతాలకు సేవలను విస్తరిస్తారు. ఈ పెట్టుబడితో డిజిటల్‌ కనెక్టివిటీ రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ తెలిపారు.

పెరుగుతున్న డిజిటల్ డిమాండ్

ప్రస్తుతం 1.5 పెటాబిట్స్‌గా ఉన్న సంస్థ నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా 6 పెటాబిట్స్‌కు పెంచనున్నారు (1 పెటాబిట్ అనేది 1,000 టెరాబిట్స్ లేదా 10 లక్షల గిగాబిట్స్‌తో సమానం). ఈ విస్తరణ 2030 నుంచి 2036 మధ్య దశలవారీగా పూర్తికానుంది. అత్యాధునిక ఏఐ వ్యవస్థలకు కంప్యూటింగ్‌ సామర్థ్యంతోపాటు వేగవంతమైన, పటిష్ఠమైన నెట్‌వర్క్‌ కూడా కీలకమని సంస్థ చీఫ్‌ ప్రొడక్ట్‌ అండ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ రూపేశ్‌ చోక్సీ పేర్కొన్నారు. ఈ హైస్పీడ్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తే దేశంలోని డేటా సెంటర్లు, క్లౌడ్ సంస్థలు, బ్యాంకులు మెరుగైన కనెక్టివిటీని పొందే అవకాశాలున్నాయి.