

న్యూఢిల్లీ: అమెరికాతో కుదురుతున్న వాణిజ్య ఒప్పందంలో దేశీయ రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లబోదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాతో జరుపుతున్న వాణిజ్య ఒప్పందం వల్ల తమ బతుకులు రోడ్డున పడతాయని వందకు పైగా రైతు సంఘాల కూటమి అయిన సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. మొక్కజొన్నలు, బాదం పాలు, వాల్నట్లు, ఆపిల్స్, సోయాబీన్ నూనె వంటి వ్యవసాయ దిగుమతులపై సుంకాలు తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్లో ధరలు పడిపోతాయని రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుందని వారు వాపోతున్నారు.
మంత్రి ధైర్య వచనాలు
ఈ విమర్శలపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ప్రజలు ఎంతో సంతోషించేలా ఈ ఒప్పందం ఉంటుందని తెలిపారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ, "అమెరికా వాణిజ్య ఒప్పంద వివరాలు బయటికి వచ్చిన తర్వాత ప్రజలు సంబరాలు చేసుకుంటారు. మన దేశంలోని ఏ ఒక్క రైతు విషయంలోనూ అన్యాయం జరగబోదు " అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టకపోవడంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారనే కోపంతో నవంబర్లో భారీ నిరసనలకు రైతు సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రభుత్వ వైఖరి మారకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.