

-లగ్జరీ కారు కోసం రూ.1.50కోట్లు పోగు చేసుకున్న నానా పాటేకర్
-టీవీలో రైతు ఆత్మహత్యల ఘటన చూసి చలించిన ‘రియల్ హీరో’
-బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన నటుడు
ముంబై: నటుడిగా ఎన్నో సినిమాలతో తనదైన శైలిలో అలరించిన నానా పాటేకర్‌కు గొప్ప మానవతావాదిగా పేరున్నది. ఆయన సినిమాల్లో నటిస్తున్న సందర్భంలో 2015లో ఒక లగ్జరీ కారు కొనుక్కోవాలని ఆశ ఉండేది. ఇందుకోసం సుమారు రూ. 1.50కోట్లు పోగు చేసుకున్నాడు. ఓ రోజు ఆయన ఇంట్లో టీవీ చూస్తుండగా అందులో ఓ ఘటన చూసి ఆయన చలించిపోయాడు. మహారాష్ర్టలో పంట చేతికి రాక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం ఆయనను కదిలించింది. ఆ రోజంతా నానాపటేకర్‌కు నిద్ర పట్టలేదు. మరునాడు ఉదయాన్నే కొందామనుకున్న కారును ఆయన వద్దనుకున్నాడు. వెంటనే తన స్నేహితుడొకరిని పిలిచి తన మనసులో విషయం చెప్పాడు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలువాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత నామ్ పౌండేషన్ ద్వారా 250కుటుంబాలను తనవద్దకు పిలిపించుకొని రూ. 15,000 చొప్పున సాయం అందజేశాడు. ఈ ఘటనే ఆయనలో ఉన్న మానవతావాదిని వెలుగులోకి తెచ్చింది.
పెయింటర్ గా జీవితం ప్రారంభించి..
నానా పాటేకర్ తొలుత తన 13 ఏండ్ల ప్రాయంలో ముంబైలో సినిమా పోస్టర్ల పెయింటర్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు. అప్పుడు ఆయన నెల జీతం రూ.35. ఈ పని కోసం నిత్యం 8 కి.మీ నడిచి వెళ్లేవాడు. ఆ తర్వాత నటుడిగా సినిమాల్లో రంగ ప్రవేశం చేసి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. 90వ దశకంలోనే ఆయన ప్రతి సినిమాకు రూ. 1.25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సినిమా వర్గాలు చెబుతుంటాయి. ప్రస్తుతం ఆయన రెమ్యునరేషన్ రూ. 2కోట్ల నుంచి రూ. 3కోట్ల వరకు ఉంటుందని మీడియా కథనాల ద్వారా తెలుస్తున్నది. దీంతో పాటు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా వ్యవహరించాడు. ఇందుకోసం రూ. 80లక్షల నుంచి రూ. కోటి వరకు తీసుకునేవారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక పటేకర్‌కు గోవా, ముంబై, మురుద్, పుణెలలో ఆస్తులు ఉన్నాయి. ఆయా చోట్ల ఇండ్లు, భూములు ఉన్నాయి. తొలుత అంధేరిలో చాలా ఏండ్ల క్రితం రూ.1.1లక్షలతో కొన్న సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ ధర ప్రస్తుతం రూ. 3కోట్ల విలువ చేస్తుందని తెలుస్తున్నది. ఇక పుణెలోని ఖడక్వాస్లాలో 27ఎకరాల్లో ఒక ఫామ్ హౌస్ ఉంది.