మరఠ్వాడాల మదిలో ‘నానా’

Nana Patekar
Nana Patekar
Published on: 

- ఈ ప్రాంతంతో పాటేకర్‌కు విడదీయలేని బంధం

-‘నామ్ ఫౌండేషన్’ ద్వారా అనేక సేవలు

-500మంది వితంతువులకు ప్రత్యేక కార్డులు

-ఉచిత వైద్యం, విద్య కోసం ఎంజీఎంతో ఒప్పందం

ఛత్రపతి శంభాజీనగర్: దిగ్గజ నటుడు నానా పాటేకర్ మరణంతో మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ప్రాంతంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. ఈ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు నానా పాటేకర్ అండగా నిలిచారు. నామ్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  సుమారు 500 మంది వితంతువులకు ఆరోగ్యకార్డులు అందజేశారు. వారికి ఛత్రపతి శంభాజీనగర్ లోని ఎంజీఎం దవాఖాన, యూనివర్సిటీలో ఉచిత వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రముఖ మరాఠా నటుడు మకరంద్ అనస్పురేతో కలిసి 2016లో నామ్ ఫౌండేషన్ ద్వారా ఆయన వారికి సాయం అందజేశారు. ఎంజీఎం యూనిర్సిటీలో జర్నలిజం డిపార్ట్‌మెంట్ హెడ్ రేఖా షెల్కే స్పందిస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతుల భార్యలకు నామ్ ఫౌండేషన్ అందించిన సహకారంతో ఐదేండ్ల పాటు ఉచిత వైద్యం అందించినట్లు తెలిపారు. అదేవిధంగా పిల్లలకు ఉచిత విద్యను అందించినట్లు చెప్పారు. ఆరు నెలల క్రితం నానా పాటేకేర్ ఎంజీఎం యూనివర్సిటీకి వచ్చి, తమ అభ్యర్థన మేరకు విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు యూనివర్సిటీ వీసీ అంకుశ్‌రావు కదం  తెలిపారు. నామ్ ఫౌండేషన్ ద్వారా పలువురికి ఆర్థిక సాయంతో పాటు కుట్టు మిషన్లు అందజేశారు. బాధిత రైతు కుటుంబాల్లో భరోసా కల్పించారు.  ప్రస్తుతం నానా పాటేకర్ మరణంతో ఆ కుటుంబాలు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నాయి. ‘నానా’ ఇక లేరనే విషయాన్ని వారు నమ్మలేకపోతున్నారు. ఆయన తమ జీవితాల్లో చిరస్మరణీయుడిగా ఉంటారని మరఠ్వాడా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒకరు వెల్లడించారు.