నట దిగ్గజం నానా పాటేకర్ ఇక లేరు

Actor NaNa patekar
Nana Patekar
Published on: 
  • గుండెపోటుతో ప్రముఖ బాలీవుడ్ నటుడి మృతి

  • ఛాతీనొప్పితో అపస్మారక స్థితికి

  • ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూత

పనాజీ (గోవా): ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్(75) ఇక లేరు. గురువారం తెల్లవారుజామున 5.20‌‌ గంటలకు గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. గోవాలోని తన ఫ్లాట్లో ఉండగా పాటేకర్కు ఛాతీనొప్పి రావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆ వెంటనే స్థానిక మణిపాల్ హాస్పిటల్కు చెందిన వైద్య బృందం ఫ్లాట్కు చేరుకొని ఆయనకు అత్యవసర వైద్యపరీక్షలు నిర్వహించింది. పాటేకర్ను స్పృహలోకి తెచ్చేందుకు వైద్యసిబ్బంది చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం మణిపాల్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం ఆస్పత్రిలోనూ 45 నిమిషాల పాటు నానా పాటేకర్కు వైద్యులు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. దీంతో పాటేకర్ చనిపోయారని ఆస్పత్రి నిర్వాహకులు తెల్లవారుజామున 5.20‌‌ గంటలకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆస్పత్రిలోని రిజిస్టర్డ్ రోగి కాకపోవడంతో, మరణం గురించి పోలీసులకూ సమాచారాన్ని అందజేశారు. పాటేకర్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అనంతరం పార్థివ దేహాన్ని కుటుంబీకులకు అప్పగిస్తామని మణిపాల్ హాస్పిటల్ వెల్లడించింది. పోస్టుమార్టం కోసం పాటేకర్ మృతదేహాన్ని గోవా మెడికల్ కాలేజీకి పంపామని తెలిపింది.

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

నానా పాటేకర్ చివరి కోరిక మేరకు, ఆయన పార్థివ దేహానికి పుణెలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాటేకర్ అంత్యక్రియలను పూర్తిస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించామని మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెలార్ ప్రకటించారు. మరాఠీ, హిందీ సినీరంగాలకు ఆయన అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. పాటేకర్ మృతిపై పలువురు నాయకులు, నటులు సంతాపం వ్యక్తం చేశారు.

భారతీయ సినీరంగానికి తీరని లోటు

‘‘సామాజిక సేవ పట్ల పాటేకర్కు ఉన్న నిబద్ధత, అణగారిన వర్గాలపై ఆయనకున్న ఆందోళనను ప్రతిబింబించింది. పాటేకర్ మరణం భారతీయ సినీ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు.

తరతరాల పాటు గుర్తుండిపోయే నటుడు

‘‘నానా పాటేకర్ జీలో ఉన్నంత తీవ్రత, ప్రత్యేకత, చెరగని ఉనికి అతి కొద్దిమంది నటుల్లోనే నాకు కనిపించింది. ప్రతి పాత్రలోనూ ఆయన అద్భుతమైన వైవిధ్యం, సృజనాత్మకతను చూపించారు. తరతరాల పాటు గుర్తుండిపోయే పాత్రలను మనకు అందించారు. తాను నమ్మిన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా స్పష్టంగా చెప్పే ఆయన సూటితనాన్ని, నిర్మొహమాటమైన అభిప్రాయాలను ప్రజలు ఎంతో గౌరవించారు. హిందీ, మరాఠీ సినీ రంగాలకు ఆయన అందించిన సేవలు అపారమైనవి. పాటేకర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అసంఖ్యాక అభిమానులకు నా సానుభూతి. ఓం శాంతి” అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు.