పాటేకర్ మరణానికి ముందు ఏం జరిగింది?

 Nana Patekar
Nana Patekar
Published on: 

తెల్లవారుజామున 2 గంటలకు ఛాతినొప్పి

2.30 గంటలకు పలువురికి ఫోన్​ కాల్స్​

అసౌకర్యంగా ఫీలవుతున్నానంటూ స్నేహితుడికి మెసేజ్

పనాజీ (గోవా): బాలీవుడ్​ నట దిగ్గజం నానా పాటేకర్​ (75) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోవడానికి ముందు గురువారం తెల్లవారుజామున గోవాలోని పనాజీ సమీపంలో ఉన్న  డోనా పౌలా తీర ప్రాంతంలోని ఫ్లాట్​లో జరిగిన కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఈవివరాలను గోవాలోని మణిపాల్​ హాస్పిటల్​కు చెందిన అంకాలజీ విభాగాధిపతి డాక్టర్​ శేఖర్​ సల్కర్​ మీడియా సమావేశంలో వెల్లడించారు.

కాల్స్​కు తక్షణ స్పందన రాలేదు

​‘‘నాకు తెలిసినంత వరకు పాటేకర్​కు గురువారం తెల్లవారుజామున దాదాపు 2 గంటల సమయంలో ఛాతీనొప్పి వచ్చింది. దీంతో ఆయన 2.30 గంటలకు కొందరికి ఫోన్​ కాల్స్​ చేశారు. తాను అసౌకర్యంగా ఫీలవుతున్నానని ఒక స్నేహితుడికి మెసేజ్​ కూడా చేశారు. అయితే అది రాత్రి సమయం కావడంతో ​ మిత్రుడి నుంచి తక్షణ స్పందన రాలేదు. దీంతో ఆ మిత్రుడికి పాటేకర్​ ఫోన్ కాల్ చేశారు. దీంతో ఆ మిత్రుడు పాటేకర్​ ఇంటికి తెల్లవారుజామున 4 గంటలకు వెళ్లాడు” అని డాక్టర్​ శేఖర్​ సల్కర్ చెప్పారు.

అపస్మారక స్థితిలో – మిత్రుడి సాయంతో ఆస్పత్రికి

‘‘అప్పటికే నానా పాటేకర్​కు చెమటలు పట్టాయి. ఆయన అపస్మారక స్థితిలోకి జారుకుంటున్నారు. పాటేకర్​కు మిత్రుడు అత్యవసర వైద్యం అందించారు. అయినా ఫలితం కనిపించలేదు. పాటేకర్​ ఫ్లాట్​కు దగ్గరలోనే మా ఆస్పత్రి (మణిపాల్​ హాస్పిటల్​) ఉంటుంది. దీంతో ఒక మనిషిని మా ఆస్పత్రికి పంపించారు. అతడితో కలిసి మా అత్యవసర వైద్యుల బృందం పాటేకర్​ ఫ్లాట్​కు వెళ్లింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న పాటేకర్​కు మా డాక్టర్స్​ టీమ్​ కార్డియాక్​ మసాజ్​ చేసింది. అయినా ఆయన స్పృహలోకి రాలేదు. దీంతో తెల్లవారుజామున 4.00 నుంచి 4.30 గంటల సమయంలో అంబులెన్స్​లో ఆస్పత్రికి తీసుకొచ్చారు. చివరి ప్రయత్నంగా మేం దాదాపు 45 నిమిషాల పాటు పాటేకర్​కు కార్డియాక్​ మసాజ్​, సీపీఆర్​ చేశాం. అయినా ఆయన ప్రాణాలు నిలువలేదు. పాటేకర్​ చనిపోయినట్లు తెల్లవారుజామున 5.20 గంటలకు మేం ప్రకటన విడుదల చేశాం. వాస్తవానికి ఆస్పత్రికి తీసుకు రావడానికి ముందే పాటేకర్​ ప్రాణాలు కోల్పోయారు” అని మణిపాల్​ హాస్పిటల్ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్​ శేఖర్​ సల్కర్ వివరించారు.

కాగా, తండ్రి నానా పాటేకర్​ మరణవార్త తెలియడంతో పుణెలో ఉన్న కుమారుడు మల్హర్​ పాటేకర్​ గోవాకు బయలుదేరారు.