మోహన్‌లాల్ 'ఆపరేషన్ గంగా'

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రానికి ‘ఆపరేషన్‌ గంగా’ టైటిల్‌ ఖరారైంది.
Operation Ganga Movie
Mohanlal and Vishnu Mohan's film gets titled 'Operation Ganga'
Published on: 

న్యూఢిల్లీ: భారతీయ చలనచిత్ర రంగంలో ఆసక్తి రేకెత్తిస్తున్న భారీ ప్రాజెక్టుకు అధికారికంగా పేరు ఖరారైంది. జాతీయ అవార్డు గ్రహీత విష్ణు మోహన్‌ దర్శకత్వంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఆపరేషన్‌ గంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో భారత్‌ చేపట్టిన సాహసోపేత తరలింపు మిషన్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దేశభక్తి ఇతివృత్తంతో, ఇప్పటివరకు వెండితెరపై చూడని కథాకథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

 ఉక్రెయిన్ విద్యార్థుల తరలింపు

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారీ తరలింపు కార్యక్రమమే ‘ఆపరేషన్‌ గంగా’. విదేశీ గడ్డపై సాగిన ఈ చారిత్రక మిషన్‌ను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో అర్జున్‌ రాంపాల్‌, భాగ్యశ్రీ బోర్సే, పార్తీబన్‌, ఆదిల్‌ హుస్సేన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేశం చేపట్టిన సాహసోపేత తరలింపు కార్యక్రమంలోని ఉత్కంఠభరిత ఘటనలను ప్రేక్షకులకు చేరువ చేయడమే లక్ష్యంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

 చిత్రంలో అందరూ మహామహులే

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ‘పుష్ప 1, 2’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన మిరోస్లావ్‌ కుబా బ్రోజెక్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘గోట్‌’, ‘అమరన్‌’ చిత్రాల ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవన్‌, ‘ధురంధర్‌’ చిత్రాల సంగీత దర్శకుడు శాశ్వత్‌ సచ్‌దేవ్‌ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. ‘కాంతార’కు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ కె.వి. సంజిత్‌, సౌండ్‌ డిజైనర్‌ బిశ్వదీప్‌ ఛటర్జీ సైతం తమ నైపుణ్యాన్ని అందిస్తున్నారు. పేరొందిన నటీనటులు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల కలయికతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.