టైగర్ ష్రాఫ్​పై కాల్పులకు ముందు ప్రాక్టీస్!

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో పోలీసులు సంచలన నిజాలు కనుగొన్నారు. దుండగులు దాడికి ముందు ముంబైలోని ఓ హోటల్ గదిలో తుపాకీతో ప్రాక్టీస్ చేసినట్లు తేలింది.
Tiger shroff
Tiger shroff
Published on: 

ముంబై: బాలీవుడ్​ నటుడు టైగర్ ష్రాఫ్​పై కాల్పుల కేసుతో ముడిపడిన మరిన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి. గురువారం వరకు 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు హర్యానా, ఇద్దరు ఉత్తరప్రదేశ్, ఒకరు బిహార్,​ మరొకరు మహారాష్ట్ర వాస్తవ్యులు. ఆదివారం (అక్టోబరు 18న) సాయంత్రం టైగర్ ష్రాఫ్​ కారుపై హృతిక్ కుమార్(బిహార్​), రేహాన్(హర్యానా)​, ఓ మైనర్ (హర్యానా)​ కలిసి కాల్పులు జరిపారు. వీరిలో ఇద్దరు నిందితులు కాల్పులు జరపడానికి ముందు, ముంబై అంధేరీ ఏరియా సమీపంలో తాము బస చేసిన  హోటల్​ రూంలో మూడు రౌండ్లు ఫైరింగ్​ ప్రాక్టీస్​ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక నిందితుడు రెండు రౌండ్లు, మరో దుండగుడు ఒక రౌండ్​ ఫైరింగ్​ చేశాడని తెలిపారు. వీరు ప్రాక్టీస్​ చేసే క్రమంలో తుపాకీ జామ్​ కావడంతో గురి తప్పి బెడ్​ను ఒక బుల్లెట్​ తాకినట్లు తేల్చారు.

ఢిల్లీ నుంచి ముంబైకి ఆయుధాల సప్లయ్​

పోలీసుల కథనం ప్రకారం.. లారెన్స్​ బిష్ణోయ్ గ్యాంగ్​కు చెందిన అనిల్​ పండిట్​ నిర్దేశం మేరకు హర్యానాకు చెందిన కునాల్, సుమిత్​​ 20 కార్ట్రిడ్జ్​లు, ఒక తుపాకీని అమృత్​సర్​లో తీసుకున్నారు. వీరిద్దరు అక్టోబరు 15న ఢిల్లీ రైల్వే స్టేషన్​కు చేరుకొని రాధ(యూపీ), బబిత(యూపీ)లకు ఆయుధాలు, మందుగుండును అప్పగించారు. ఆ మహిళలు అక్టోబర్ 17న ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఒక హోటల్‌లో బస చేశారు. తదుపరిగా ఈ ఆయుధాలను షూటర్లకు అందించారు. ఆ వెంటనే రాధ, బబిత ట్రైన్​లో ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు. ఇది జరిగిన మరుసటి రోజే (ఆదివారం) టైగర్ ష్రాఫ్​ కారుపై కాల్పులు జరిగాయి.

పుణ్యక్షేత్రాల దర్శనం కోసమే ముంబైకి

పోలీసులు రాధ, బబితలను అరెస్టు చేసి ప్రశ్నించగా, పుణ్యక్షేత్రాల దర్శనం కోసమే తాము ఢిల్లీ నుంచి  ముంబైకి  వెళ్లామని చెప్పడం గమనార్హం. బబిత యూపీలోని ఆజంగఢ్​ వాస్తవ్యురాలు. ఆమె హర్యానాలోని సోనీపట్​లో ప్యాకర్​గా పనిచేస్తోంది. ‘‘ఒకవేళ బబిత తప్పు చేసిందని తేలితే, తప్పకుండా శిక్షించాలి. ఆయుధాల స్మగ్లింగ్​లో భాగమైన విషయం కూడా బబితకు తెలియదు” అని ఆమె కుటుంబీకులు తెలిపారు. తన కూతురు అమాయకురాలని, ఆమెను ఎవరైనా తప్పుదోవ పట్టించి ఉండొచ్చని రాధా తల్లి మైనా చెప్పుకొచ్చారు.  

మిగతా నలుగురు నిందితులు వీరే

మిగతా నలుగురు నిందితుల్లో సమీర్​, రాజేశ్​ కటక్, అంకిత్​, నితిన్​ ఉన్నారు. కాల్పులకు పాల్పడిన ముగ్గురికి, అనిల్​ పండిట్​కు మధ్య అనుసంధానకర్తగా సమీర్ (హర్యానా)​ వ్యవహరించాడు. ఇక ముంబైలో షూటర్లకు రాజేశ్​ కటక్​ (మహారాష్ట్ర) సాయం చేశాడు. ఈ కుట్రలో భాగస్వాములుగా  హర్యానాకే చెందిన అంకిత్​, నితిన్​ వ్యవహరించారు.

హృతిక్ బైక్​ ట్యాక్సీ – కారుపై కాల్పులు

టైగర్​ ష్రాఫ్​పై కాల్పుల కోసం నిందితులకు ప్రత్యక్షంగా సహకరించిన 22 ఏళ్ల హృతిక్ కుమార్ బిహార్​లోని బెగుసరాయ్ వాస్తవ్యుడు. ​అతడు ఇంటర్​ వరకు చదువుకున్నాడు. రెండేళ్ల క్రితమే ఢిల్లీకి చేరుకొని ఒక క్యాటరింగ్​ ఏజెన్సీలో పనికి కుదిరాడు. తాజాగా మూడు నెలల క్రితం ముంబైకి చేరుకొని ఒక రెస్టారెంట్​లో వంటపనులు చేయడం మొదలుపెట్టాడు. తదుపరిగా బైక్​ ట్యాక్సీ డ్రైవర్​గా వర్క్ చేయడం మొదలుపెట్టాడని పోలీసులు గుర్తించారు. టైగర్​ ష్రాఫ్​పై దాడి సమయంలో హృతిక్ కుమార్ పసుపు రంగు పల్సర్ బైక్‌ను నడిపాడు. అతను బైక్ నడుపుతుండగా, వెనుక కూర్చున్న మిగిలిన ఇద్దరు నిందితులు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపారు.