

ముంబై: దేశంలో శాంతి తగ్గిపోతోందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ స్పందించారు. ఆ మాటలను సందర్భోచితంగా కాకుండా వక్రీకరించారని స్పష్టం చేశారు. ప్రముఖ వ్యాఖ్యాత శేఖర్ సుమన్ నిర్వహించే ‘శేఖర్ టునైట్’ టాక్ షోలో పాల్గొన్న సందర్భంగా సంజయ్ దత్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు ఎంతో ఆప్యాయత, ఆతిథ్యం ఇచ్చే మనుషులని కొనియాడుతూనే, పూర్వంలాగా ఇప్పుడు దేశంలో శాంతిభద్రతల వాతావరణం కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆ పాత రోజులు మళ్లీ తిరిగి రావాలని తాను పరమశివుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీశాయి.
గాంధీగిరి స్ఫూర్తితోనే వ్యాఖ్యలు
వివాదం ముదరడంతో సంజయ్ దత్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆ షోలో సాగిన సంభాషణ ముందస్తు స్క్రిప్ట్ ప్రకారం జరిగిన సరదా ప్రసంగమని తెలిపారు. ‘మున్నాభాయ్’ చిత్రాల్లో కనిపించే హాస్యం, వ్యంగ్యం మేళవింపుతో సాగిన ఆ మాటల వెనుక ‘గాంధీగిరి’ స్ఫూర్తి మాత్రమే ఉందని గుర్తుచేశారు. ప్రేమ, ఐక్యత, సద్భావనను పంచాలనే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఆలోచన కాదని చెప్పారు.
ఏ వర్గాన్నీ కించపరచలేదు
ఏ ఒక్క వ్యక్తినీ, సముదాయాన్ని లేదా రాజ్యాంగ వ్యవస్థను అవమానించాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని సంజయ్ దత్ నొక్కిచెప్పారు. సంభాషణ జరిగిన మొత్తం సందర్భాన్ని అర్థం చేసుకోకుండా కేవలం కొన్ని మాటలనే ప్రచారంలోకి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటలను సృజనాత్మక కోణంలోనే పరిగణించాలని పాఠకులను, ప్రేక్షకులను కోరారు. దాంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.