

ముంబయి : బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై దాడి కుట్ర కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక నిందితుడు ప్రాంజల్ థక్రాల్ (22)ను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో పరదేశీపురా ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిట్ ఆదేశాలతో ప్రాంజల్ ఈ దాడికి ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. షూటర్లకు నిధులు, ఆయుధ సామగ్రి సమకూర్చడంలోనూ అతడి పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు.
అనిల్ పండిట్, ప్రాంజల్ రహస్య యాప్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ప్రాంజల్ ఫోన్‌లో లభించిన చాటింగ్ వివరాలు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ పండిట్‌కు ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్, ఇతర వ్యక్తుల పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రాంజల్‌ను ముంబైలోని ఎస్ప్లనేడ్ (కిల్లా) కోర్టు హాలిడే బెంచ్ ముందు హాజరుపరచగా.. అక్టోబరు 31 వరకు పోలీసు కస్టడీకి అప్పగించారు.
ప్రాంజల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేశాడు. గతంలో హరియాణాలోని పానిపట్‌లో ఓ వ్యాపారిపై దాడి కేసులో జైలుకు వెళ్లాడు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న అతడు.. టైగర్ ష్రాఫ్‌పై దాడి కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బిష్ణోయ్ గ్యాంగ్ తొలుత బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఆయన నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో వెనక్కి తగ్గినట్లు అనుమానిస్తున్నారు. ఆమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ నివాసాల పరిసరాల్లోనూ నిందితులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాలీవుడ్‌లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసినట్టు సమాచారం.