కథలు చెప్పడం కూడా ఒక ప్రతిఘటనా?

పాదాలకు సంకెళ్లు పడితే.. మనసు స్వేచ్ఛగా విహరించడం మొదలుపెడుతుంది. అడుగులు ఆగిపోయినా.. ఆలోచనలు అనంతమైన లోకాలను అన్వేషిస్తాయి. ఆ ఆలోచనలకు అక్షర రూపమే ‘సిటీ ఆఫ్ విండోస్‌’ నవల.
Nadia Hashimi
Afghan Woman Nadia Hashimiscroll.in
Published on: 

పాదాలు బంధించినప్పుడు/ మనసు నడవడం ప్రారంభిస్తుంది/ అడుగులకు సంకెళ్లు పడినప్పుడు/ మనసు అనంతమైన లోకాలను అన్వేషించడం మొదలుపెడుతుంది/ ఆ ఆలోచనలకు అక్షర రూపమే ‘సీటి ఆఫ్ విండోస్’ నవల. 2021లో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆఫ్ఘన్ మహిళలు ఎదుర్కొన్న కష్టాలే ఈ కథకు నేపథ్యం. ఈ నవల రాయడానికి గల కారణాల్ని పంచుకున్న ఆఫ్ఘన్ రచయిత్రి ‘నాడియా హషిమి’ మాటలు ఇవి!

ఈ నవల రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది?

యుద్ధం, వలసలు, పేదరికం, మహిళలపై వివక్ష వంటి అంశాలు నా కథల్లో ప్రతిబింబిస్తాయి. 2021 ఆగస్టులో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనుదిరుగుతున్న సమయంలో, తాలిబన్లు కాబూల్ వైపు దూసుకొచ్చారు. ఆ సమయంలో ప్రమాదంలో ఉన్నవారిని అమెరికాకు తరలించేందుకు అవసరమైన వివరాలను సేకరించే పనిలో నేను పాల్గొన్నాను. ఆ తర్వాత అమెరికాకు తరలించిన ఆఫ్ఘన్లకు మానసిక సహాయ కార్యక్రమంలో పనిచేశాను. వారి బాధాకరమైన అనుభవాలు నన్ను కలచివేశాయి. ఆ తర్వాత తాలిబన్లపై పోరాటంలో పాల్గొన్న ఆఫ్ఘన్ మహిళా సైనికుల కథలు నా దృష్టిని ఆకర్షించాయి. ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ వారు ధైర్యంగా విధులు నిర్వర్తించారు. వారి జీవితాలను, తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడంతో మహిళలు కోల్పోయిన స్వేచ్ఛను ‘సిటీ ఆఫ్ విండోస్’ ద్వారా చెప్పాలనుకున్నాను.

 విభిన్న నేపథ్యాలున్న మహిళల కథలను ఒకే నవలలో ఎందుకు చేర్చారు?

ఆఫ్ఘన్ మహిళలను కేవలం అణచివేతకు గురైన బాధితులుగా మాత్రమే చూడకూడదు. వారికంటూ ఆశలు, ఆశయాలు, ఆనందాలు, వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. సైనికులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, సంగీతకారులు, దుకాణ యజమానులు వంటి విభిన్న మహిళల జీవితాలను ఈ నవలలో చూపించాను.

ఆఫ్ఘన్ మహిళలు తమ కుటుంబాలను, సమాజాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. వారి ధైర్యంతోపాటు వారి బలహీనతలు, భావోద్వేగాలు, వ్యక్తిత్వంలోని సంక్లిష్టతలను కూడా పాఠకులు అర్థం చేసుకోవాలని కోరుకుంటాను.

 మహిళల బాధను గొప్పగా రాయడానికి కారణం?

ఆఫ్ఘన్ మహిళల సహనాన్ని తరచూ ప్రశంసిస్తుంటాం. కానీ ఆ ప్రశంసల వెనుక వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను విస్మరించే ప్రమాదం ఉంది. ప్రతి మహిళా బాధను తట్టుకుని నిలబడలేరు. కొందరు తమ బాధలను బయటపెట్టలేక మౌనంగా జీవిస్తారు. మరికొందరి జీవితాలు హింసకు బలవుతాయి. మహిళలను కేవలం వీరనారులుగా కాకుండా భయం, కోపం, బాధ, ఆశలు కలిగిన సాధారణ మనుషులుగా చూపించాలనుకున్నాను.

 మాతృత్వం, స్వేచ్ఛ మధ్య సంఘర్షణను ఎలా చూశారు?

బాల్యవివాహం, హింసాత్మక భర్త నుంచి తప్పించుకున్న మార్జన్ తన కుమార్తెను పెంచుతూ కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఒంటరి మహిళగా జీవించడం, బిడ్డకు ఆహారం, దుస్తులు సమకూర్చడం, తన ఆశయాలను కాపాడుకోవడం ఆమెకు పెద్ద సవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక తల్లి తన బిడ్డను కాపాడుకుంటూనే తన స్వేచ్ఛను, వ్యక్తిత్వాన్ని ఎలా నిలబెట్టుకోగలదన్నదే ఈ కథలోని ముఖ్యమైన ప్రశ్న.

 అంతర్జాతీయ మీడియా ఆఫ్ఘన్ మహిళలను ఎలా చూపిస్తోంది?

చాలాసార్లు మీడియా ఆఫ్ఘన్ మహిళల జీవితంలోని ఒక కోణాన్ని మాత్రమే చూపిస్తుంది. రహస్యంగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలిని చూపించినా, ఆమె కుటుంబ జీవితం, ఆశలు, వ్యక్తిగత పోరాటాలు మనకు తెలియవు. మహిళలను ఒక దేశానికి లేదా అణచివేతకు ప్రతీకలుగా మాత్రమే చూడటం సరైంది కాదు. ప్రతి మహిళకూ ప్రత్యేకమైన జీవితం, అనుభవాలు ఉంటాయి.

 సొంత దేశం నుంచి దూరమైనవారికి ‘ఇల్లు’ అంటే ఏమిటి?

బలవంతంగా దేశం విడిచి వెళ్లినవారు తమకు భద్రత లేని స్వదేశాన్ని మర్చిపోలేరు. ఇల్లు అంటే కేవలం ఒక ప్రదేశం కాదు. భద్రత, కుటుంబ అనుబంధం, భవిష్యత్తుపై ఆశ కలిగిన కాలం కూడా ఇల్లే. కొత్త దేశంలో జీవితాన్ని నిర్మించుకున్నప్పటికీ, స్వదేశంపై ప్రేమ పూర్తిగా మాయమవదు.

కథలు చెప్పడం కూడా ఒక ప్రతిఘటనా?

నిస్సందేహంగా. కథలు మనుషులను కలుపుతాయి, అవగాహన కల్పిస్తాయి, స్ఫూర్తినిస్తాయి. మహిళలు ఏమి మాట్లాడాలి, ఏమి రాయాలి, ఎలా జీవించాలి అనే విషయాలను ఒక పాలక వ్యవస్థ నియంత్రించాలనుకున్నప్పుడు, వారి కథలను రాయడం ప్రతిఘటనగా మారుతుంది. మహిళల అనుభవాలు కూడా చరిత్రలో భాగమే. ఆఫ్ఘన్ మహిళలు తమ అనుభవాలను కవితలు, ఉత్తరాలు, వ్యాసాల రూపంలో నమోదు చేయడం ఆశాజనకమైన పరిణామం.

SLOWKING

ఈ నవల ద్వారా పాఠకులకు ఏం చెప్పాలనుకున్నారు?

ఆఫ్ఘన్ సంస్కృతి, చరిత్ర గురించి పాఠకులకు పరిచయం కల్పించడం నా రచనలలో ఒక భాగం. అయితే నా పాత్రల జీవితాలకు న్యాయం చేయడమే నా ప్రధాన లక్ష్యం. ఆ పాత్రల అనుభవాల ద్వారా వివిధ నేపథ్యాలున్న పాఠకులు ఆఫ్ఘనిస్తాన్‌ను మరింత మానవీయంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటాను.

 నవలలోని ఏ పాత్రతో మాట్లాడాలనుకుంటారు?

మార్జన్ కుమార్తె హవాను కలసి ఓదార్చాలనుకుంటాను. ఆమె తల్లి ఎప్పుడూ తనను ప్రేమించిందని, కష్టాల్లోనూ తనకు మంచి జీవితం ఇవ్వడానికి ప్రయత్నించిందని చెప్పాలనుకుంటాను. తల్లులు మనకు తల్లులుగా పరిచయం కాకముందు వారి జీవితాల్లో ఎన్నో అనుభవాలు, బాధలు ఉంటాయి. తల్లీకూతుళ్లు ఒకరినొకరు అర్థం చేసుకుని, పరస్పరం క్షమించుకుంటూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.