

లండన్: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ)పై నియంత్రణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ అన్నారు. పాలు, వాషింగ్ మిషిన్లతో పోలిస్తే ఏఐపై తక్కువ భద్రతా నిబంధనలు అమల్లో ఉన్నాయని సోమవారం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం వాషింగ్ మిషిన్‌పై కూడా ఏఐ కంటే ఎక్కువ భద్రతా నిబంధనలు అమల్లో ఉన్నాయి. దుకాణాల్లో విక్రయించే ప్రతి పాల ప్యాకెట్‌కూ భద్రతా నియమాలు, తనిఖీలు ఉంటాయి’’ అని వ్యాఖ్యానించారు. ఏఐ సాంకేతికతలను స్వతంత్ర నిపుణులతో పరిశీలింపజేసి, వాటి వల్ల కలిగే ప్రమాదాలను అంచనా వేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్మిత్ సూచించారు. ఏఐ వ్యవస్థల దుర్వినియోగం వల్ల ఎవరైనా బాధితులైతే వారికి సమాచారం అందించేలా చట్టాలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ఇతర ఉత్పత్తుల భద్రత కోసం ఇప్పటికే అమల్లో ఉన్న విధానాలను ఏఐ రంగంలోనూ అనుసరించాలని పేర్కొన్నారు.
ఏఐ నియంత్రణలో బ్రిటన్ కీలకం
ఏఐ నియంత్రణలో నాయకత్వం వహించగల దేశాల్లో బ్రిటన్ ముందుంటుందని బ్రాడ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాని రిషి సునాక్ హయాంలో ప్రారంభమైన ఏఐ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ ఇందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అమెరికా అధికారులు బ్రిటన్ను, బ్రస్సెల్స్‌ను చూసే విధానాల్లో గణనీయమైన తేడా ఉందని తెలిపారు. బ్రస్సెల్స్ తన ఏఐ చట్టం ద్వారా ప్రమాద స్థాయిని బట్టి సాంకేతికతను నియంత్రిస్తోందని వివరించారు. బ్రిటన్‌కు చెందిన సంస్థ ప్రధాన ఏఐ మోడళ్ల రూపకర్తలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల వాటి సామర్థ్యాలు, సంభావ్య ప్రమాదాలను అంచనా వేయడానికి వీలవుతుందని స్మిత్ పేర్కొన్నారు.