

మంచి రూపం కోసం లుక్స్‌మ్యాక్సింగ్.. నాణ్యమైన నిద్ర కోసం స్లీప్‌మ్యాక్సింగ్.. ఆహారంలో ప్రొటీన్ పెంచుకోవడానికి ప్రొటీన్‌మ్యాక్సింగ్.. ఆఫీస్ పనుల్లో లేదా రోజువారీ కోడింగ్, కంటెంట్ తయారీలో AI టూల్స్‌ను విస్తృతంగా ఉపయోగించి పని సామర్థ్యాన్ని గరిష్టం చేసుకోవడం..టోకెన్‌మ్యాక్సింగ్, ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా, ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం..కోజీమ్యాక్సింగ్ ఇలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘మ్యాక్సింగ్’ ట్రెండ్ కనిపిస్తోంది. జీవితంలోని ప్రతి అంశాన్ని మెరుగుపరుచుకోవాలనే ప్రయత్నానికి ఈ పదం కొత్త గుర్తింపుగా మారింది. అందం, ఆరోగ్యం, పని, విశ్రాంతి.. ఇలా ప్రతిదానికీ ‘మ్యాక్సింగ్’ ట్రెండ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే డిక్షనరీ.కామ్ (Dictionary.com) 2026 సంవత్సరపు పదంగా ‘మ్యాక్సింగ్’ (maxxing)ను ఎంపిక చేసింది.
మ్యాక్సింగ్ అంటే ఏమిటి?
‘మ్యాక్సింగ్’ అనే పదం ‘మ్యాక్సిమైజింగ్’ నుంచి వచ్చింది. ఏదైనా పనిని సాధ్యమైనంత మెరుగ్గా చేయడం లేదా అత్యుత్తమంగా చేయడానికి ప్రయత్నించడం. గేమింగ్ ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న ‘మిన్-మ్యాక్సింగ్’ అనే పదం దీనికి మూలం. ఇందులో బలాలను పెంచుకుంటూ, బలహీనతలను తగ్గించుకోవడంపై దృష్టి పెడతారు. కాలక్రమంలో ఈ పదం ఇంటర్నెట్ స్లాంగ్‌గా మారింది. ముఖ్యంగా ‘లుక్స్‌మ్యాక్సింగ్’ ప్రాచుర్యంలోకి రావడంతో.. ‘మ్యాక్సింగ్’ అనే పదం ఇతర జీవనశైలి అంశాలకూ విస్తరించింది సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది.
ఎందుకింత క్రేజ్?
సోషల్ మీడియాలో మెరుగైన చర్మం, ఆరోగ్యకరమైన శరీరం, మెరుగైన ఆహారపు అలవాట్లు, వేగంగా పనులు పూర్తి చేసే పద్ధతుల గురించి నిత్యం చర్చ జరుగుతోంది. ఈ ప్రయత్నాలన్నింటినీ ఒకే పదంతో చెప్పగలగడం ‘మ్యాక్సింగ్’కు ఆదరణ పెరగడానికి ఓ కారణం. డిక్షనరీ.కామ్ ప్రకారం.. 2026 ఆగస్టులో డిజిటల్ మీడియాలో ‘మ్యాక్సింగ్’ ప్రస్తావనలు, 2025లోని నెలవారీ సగటుతో పోలిస్తే దాదాపు 19 రెట్లు పెరిగాయి. మొత్తానికి, జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆలోచనకు ఇంటర్నెట్ కొత్త భాషను సృష్టిస్తోంది.
గతంలో 67, డిమ్యూర్, హాల్యూసినేట్
డిక్షనరీ.కామ్ 2025 సంవత్సరపు పదంగా ‘67 (సిక్స్-సెవెన్)’ను ఎంపిక చేసింది. యువతలో సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పదానికి నిర్దిష్టమైన అర్థం లేదు. 2024లో ‘డిమ్యూర్ (Demure)’ను వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. నిరాడంబరంగా, హుందాగా, మర్యాదగా కనిపించడం లేదా ప్రవర్తించడాన్ని ఈ పదం సూచిస్తుంది. ‘వెరీ డిమ్యూర్.. వెరీ మైండ్‌ఫుల్’ అనే మాటలతో ఈ పదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2023 సంవత్సరపు పదంగా హాల్యూసినేట్ (Hallucinate)’ను ఎంపిక చేసింది. కృత్రిమ మేధ (AI) సందర్భంలో వాస్తవం కాని సమాచారాన్ని సృష్టించి, దాన్ని నిజమని చూపించడాన్ని ఈ పదం సూచిస్తుంది. ఏఐ చాట్‌బాట్‌ల వినియోగం పెరగడంతో ఈ పదానికి ప్రాధాన్యం పెరిగింది.