

ఫ్లోరిడా: అమెరికాతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌పై మరోసారి దాడులకు దిగుతామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ దాడులు ‘చిన్నపాటి ఎపిక్ ఫ్యూరీ’ తరహాలో ఉంటాయని స్పష్టం చేశారు. శనివారం ఫ్లోరిడాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చర్చలకు ముందుకొస్తే సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అయితే, దాడులు చేయకుండా ఉండాలంటే ఇరాన్‌కు విధించిన షరతులేమిటో ఆయన వెల్లడించలేదు. తుర్కియేలోని అమెరికా రాయబారి టామ్ బరాక్ ఇరాన్‌పై ఈ వారాంతంలో దాడులు జరిగే అవకాశం ఉందని ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కొన్ని గంటలకే ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు. బరాక్ తుర్కియేలో అమెరికా రాయబారిగా, సిరియా వ్యవహారాల్లో కీలక ప్రతినిధిగా ఉన్నారు. ఈ వారాంతంలో ఇరాన్‌పై దాడులు జరిగే అవకాశముందా? అన్న ప్రశ్నకు ‘కచ్చితంగా ఉండొచ్చు. ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు. కాగా, బారక్ వ్యాఖ్యలను ట్రంప్ తొలుత తేలికగా తీసుకున్నారు. ‘ఆయన నా రాయబారేనా? ఆయన చాలా శక్తిమంతుడని అనుకుంటా. అదే నిజమైతే.. ఈ విషయం గురించి నాకేమీ తెలియదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
త్వరలోనే యుద్ధానికి ముగింపు: ట్రంప్
ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ‘ఒప్పందం ద్వారా అయినా, మరో విధంగానైనా ఈ యుద్ధం ముగుస్తుంది’ అని ఫ్లోరిడాకు చెందిన ఓ స్థానిక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, ఎప్పటిలోగా యుద్ధం ముగుస్తుందనేది వెల్లడించలేదు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయా? అన్న విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా నిరోధించడమే అమెరికా సైనిక చర్యల ప్రధాన ఉద్దేశమని ట్రంప్ పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వాలు ఈ ముప్పును ఎదుర్కోవడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ‘నేను ఇరాన్‌పై దాడి చేయకపోతే ఆ దేశం అణ్వాయుధాన్ని సమకూర్చుకునేది’ అని పేర్కొన్నారు.
‘నిప్పుతో చెలగాటమొద్దు’.. ఇరాన్ హెచ్చరిక
నిప్పుతో చెలగాటమాడొద్దని అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగితే గల్ఫ్ ప్రాంతంలోని సముద్రగర్భ సమాచార కేబుళ్లను లక్ష్యంగా చేసుకునేందుకు ఇరాన్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ‘ఇరాన్‌పై దాడి జరిగితే ఊరుకునేది లేదు. సముద్రగర్భ కేబుళ్ల నుంచి రహస్య స్థావరాలు సహా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటాం’ అని ఓ ఇరాన్ అధికారి హెచ్చరించినట్లు రాయిటర్స్ తెలిపింది.
అమెరికా అధికారులపై దాడులకు ఇరాన్ కుట్ర?
అమెరికా అధికారులను లక్ష్యంగా చేసుకునేందుకు ఇరాన్ ప్రయత్నాలను ముమ్మరం చేసిందని, ఈ ప్రణాళికలు కీలక దశకు చేరుకున్నాయని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా సహా, పశ్చిమాసియాలోని పలు దేశాల్లో అమెరికా రాయబార కార్యాలయాల్లో సిబ్బందిని తగ్గించారు. దీనికి సంబంధించి అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ జె.క్లేటన్.. విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు అక్టోబరు 23న రహస్య నివేదికను పంపినట్లు ఆక్సియోస్ వెల్లడించింది. అయితే, అందులో లక్ష్యాల వివరాలు, మిడిల్ ఈస్ట్ వెలుపల ఉన్న దేశాల పేర్లు లేదా కుట్రల స్వరూపాన్ని పేర్కొనలేదు. ఇటీవల రియాద్‌లోని రాయబార కార్యాలయం, జెడ్డా, ధహ్రాన్‌లోని కాన్సులేట్ల నుంచి అత్యవసర విధుల్లో లేని సిబ్బంది వెళ్లిపోవాలని అమెరికా ఆదేశించింది. అనంతరం యూఏఈ, లెబనాన్, ఖతార్, జోర్డాన్‌లలోని అమెరికా రాయబార కార్యాలయాల్లోనూ సిబ్బందిని తగ్గించారు. ఈ ప్రక్రియ గందరగోళంగా సాగిందని కొందరు దౌత్యవేత్తలు అభివర్ణించినట్లు సమాచారం.