చిలీ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షాలు

చిలీ రాజధాని శాంటియాగోతో పాటు పరిసర ప్రాంతాలను గురువారం భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లపై కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
Heavy rainfall causes floods in Santiago
Heavy rainfall causes floods in Santiago
Published on: 

ప్రభాత ఉదయం, శాంటియాగో (చిలీ): చిలీ రాజధాని శాంటియాగోతో పాటు పరిసర ప్రాంతాలను గురువారం భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లపై కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది.

ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వరద తీవ్రత దృష్ట్యా అధ్యక్షుడు హోసే ఆంటోనియో కాస్ట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సహాయ చర్యలను  ముమ్మరం చేయాలని ఆదేశించారు.

శాంటియాగో నగరం గుండా ప్రవహించే మాపోచో నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహించడంతో తీర ప్రజలను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ముందు జాగ్రత్తగా శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇప్పటి వరకు 1,000 మందికి పైగా ప్రజలను రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న తీవ్రమైన ‘ఎల్ నినో’ ప్రభావం వల్లే ఈ ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డిసెంబర్ నాటికి ఎల్ నినో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, 1950 తర్వాత నమోదైన తీవ్రమైన విపత్తుల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది.