

నేషనల్ డెస్క్: సౌదీ అరేబియా తూర్పు ప్రావిన్స్‌లోని ప్రపంచంలోని అతిపెద్ద చమురు సంస్థల్లో ఒకటైన అరామ్‌కో ప్రధాన కేంద్రంపై హూతీలు దాడి చేశారు. దాడిలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించిందని, ఎవరికీ గాయాలు కాలేదని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హూతీ తిరుగుబాటు దారులు, సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు మంగళవారం రాత్రి పరస్పరం దాడులు చేసుకోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
రియాద్‌పై క్షిపణి దాడులు
హూతీలు ప్రయోగించిన రెండు క్షిపణులను సౌదీ అరేబియా రక్షణ దళాలు అడ్డుకున్నాయి. వాటి శకలాలు రాజధాని రియాద్‌లోని నివాస ప్రాంతాలపై పడ్డాయని పౌర రక్షణ విభాగం తెలిపింది. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, 15 ఇళ్లు దెబ్బతిన్నాయి. రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం జరిగిన దాడిలో కనీసం 13 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడినట్లు నివేదిక పేర్కొంది.
సనాపై సౌదీ వైమానిక దాడులు
హూతీల ఆధీనంలో ఉన్న యెమెన్ రాజధాని సనాపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు మంగళవారం వైమానిక దాడులు చేశాయి. సనాలోని యెమెన్ ఆయిల్ కంపెనీ కేంద్రం, ఇంధన నిల్వ ప్రాంతాలను హూతీలు క్షిపణులు, డ్రోన్ల నిల్వ కోసం ఉపయోగిస్తున్నారని సౌదీ సంకీర్ణ దళాలు ఆరోపించాయి. అయితే, తమ నిల్వ కేంద్రాలు ఖాళీగా ఉన్నాయని, దాడి వల్ల చమురు నిల్వలు లేదా ప్రజలకు సరఫరాలపై ప్రభావం ఉండదని యెమెన్ ఆయిల్ కంపెనీ పేర్కొంది.
విమాన సర్వీసులపై ప్రభావం
మరిన్ని దాడులు జరిగవచ్చన్న నేపథ్యంలో బీమా సంస్థలు, ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు విమానయాన సంస్థలు మంగళవారం తమ విమానాల్లో కొన్నింటిని రియాద్ నుంచి సౌదీ అరేబియాలోని ఇతర విమానాశ్రయాలకు తరలించాయి. విమానయాన విశ్లేషణ సంస్థ సిరియం గణాంకాల ప్రకారం అక్టోబర్ 8 నుంచి సౌదీ అరేబియాలోని విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన 3,120కి పైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం బయలుదేరాల్సిన 300కి పైగా విమానాలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. హూతీల దాడుల నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు సౌదీ అరేబియాకు సర్వీసులు నిలిపివేశాయి.
తైజ్ నగరంలో ఆరుగురు మృతి
యెమెన్ నైరుతి ప్రాంతంలోని కీలక నగరం తైజ్‌లో హూతీల దాడుల్లో 24 గంటల్లో ఆరుగురు మరణించగా, 18 మంది గాయపడినట్లు యెమెన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాడుల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ నివాసాలను వదిలి వెళ్లాల్సి వస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. వంటగ్యాస్ కొరత తీవ్రంగా ఉందని, ఆహార ధరలు సుమారు 50 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు.
బాబ్ అల్ మందెబ్ జలసంధిపై ఆందోళన
యెమెన్‌లో కీలక ప్రాంతాలను హూతీలు స్వాధీనం చేసుకోవడంతో నెల నుంచి ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఎర్ర సముద్రం దక్షిణ భాగంలోని బాబ్ అల్ మందెబ్ జలసంధి అంతర్జాతీయ చమురు, వస్తు రవాణాకు అత్యంత కీలకం. ఈ ప్రాంతంలో నౌకాయానానికి ముప్పు ఏర్పడితే ప్రపంచ సరఫరాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
అమెరికా ప్రత్యక్షంగా సహకరించాలి
హూతీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అమెరికా సైన్యం మరింత ప్రత్యక్షంగా సహకరించాలని సౌదీ అరేబియా కోరుతోంది. ప్రస్తుతం అమెరికా నిఘా సమాచారం, లక్ష్యాల గుర్తింపు, సైనిక ప్రణాళికల్లో సహకరిస్తోంది. అమెరికా యుద్ధంలోకి దిగితే హూతీలు సముద్ర రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.