

అబుదాబి: మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థల్లో తక్షణం సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ఇందుకు దేశాలు తమ మధ్య పరస్పరం సహకారం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. యూఏఈ రాజధాని అబుదాబిలో బుధవారం జరిగిన ‘రైసినా డైలాగ్ మిడిల్ ఈస్ట్’ సదస్సులో ఆ దేశ డిప్యూటీ పీఎం, షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి ఎస్.జైశంకర్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ‘ప్రపంచ భవిష్యత్– శక్తి, లక్ష్యాలు, అవకాశాలు’ అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ప్రపంచ వ్యవస్థలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఇందుకు దీర్ఘకాలిక పరిణామాలతో పాటు తక్షణ ఘటనలు కూడా కారణమవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో దేశాలు తమ అవసరాలకు తగ్గట్టుగా కొత్త భాగస్వామ్యాలు, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయని వివరించారు. ‘ఈ ప్రయత్నంలో కొత్త భాగస్వామ్యాలు, సరికొత్త అవకాశాలను అన్వేషించడం సహజం’ అని చర్చ అనంతరం సోషల్‌మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. ‘ప్రపంచ దేశాల మధ్య బలమైన సహకారం(మినీలేటరలిజం) అవసరం, అన్ని దేశాల(బహుళపక్షాలు) మధ్య ఏకాభిప్రాయం సాధించడం కష్టం. ఈ సమయంలో ఆ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు కీలకంగా వ్యవహరిస్తాయి’ అని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా దేశాలు ఎలా స్పందిస్తున్నాయనే దానికి దశాబ్ద కాలంగా భారత్–యూఏఈ మధ్య కొనసాగుతున్న సంబంధాలు ఉదాహరణగా నిలుస్తున్నాయన్నాయన్నారు. ఇలాంటి వ్యూహాత్మక సంబంధాల కోసం ప్రపంచ దేశాలు తమ పరిధులను దాటి ఆలోచించాలని జైశంకర్ సూచించారు.
యూఏఈ విదేశాంగ మంత్రితో చర్చలు
మూడు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో జైశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశం ‘ఆత్మీయంగా, ఫలప్రదంగా’ సాగిందని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రపంచ వ్యవహారాలపై ఇరువురు నేతలు చర్చించారు. గల్ఫ్‌లో యూఏఈ భారత్‌కు కీలక భాగస్వామిగా ఉంది. 2024 నాటికి యూఏఈలో నివసిస్తున్న భారతీయుల సంఖ్యల సుమారు 43 లక్షల అని, ఇది ఆ దేశ జనాభాలో సుమారు 35 శాతమని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 2022 మే నెలలో అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ) ప్రకారం రెండు దేశాల మధ్య ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ.. తదితర రంగాల్లో సహకారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల విదేశాంగ శాఖ మంత్రుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.