

కాలిఫోర్నియా: సెమీకండక్టర్ల రంగంలో ప్రపంచంలోనే అత్యంత అగ్రగామిగా ఉన్న ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ ఎన్విడియా కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ విప్లవానికి ఎన్విడియా తయారు చేసే చిప్లే వెన్నుముకగా నిలిచాయి. అయితే, ఇందులో పనిచేసే ఉద్యోగులకు మాత్రం ఎవరి భోజనాన్ని వారే కొనుక్కుని తినాల్సి ఉంటుంది. అది కంపెనీ రూల్. సిలికాన్ వ్యాలీలోని ఇతర ప్రముఖ కంపెనీలు క్యాంటీన్లలో ఉచిత ఆహార సదుపాయాలు కల్పిస్తుంటే, ఈ సంస్థ మాత్రం అందుకు భిన్నమైన పద్ధతిని అమలు చేస్తోంది. ఇక్కడ ఉద్యోగులు మాత్రం తమ బిల్లులు తామే చెల్లించుకునే వినూత్న విధానం కొనసాగుతోంది. 5 ట్రిలియన్స్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన అతిపెద్ద సంస్థగా వెలుగొందుతున్నప్పటికీ, ఈ విషయంలో మాత్రం యాజమాన్యం ఒక వినూత్నమైన నియమాన్ని పాటిస్తోంది.
ఉచితాలు కాదు.. భారీ సంపదను పంచే టెక్ కల్చర్
క్యాంటీన్లలో ఉచిత భోజనం అందించడానికి బదులుగా ఉద్యోగులకు భారీ వేతనాలు, స్టాక్ ఆప్షన్ల రూపంలో అత్యధిక ప్రయోజనాలను పంచుతోంది ఎన్విడియా. సీఈఓ జెన్సన్ హువాంగ్ అనుసరిస్తున్న ఈ ప్రత్యేక విధానం వల్ల కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందికి ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూరుతోంది. ఉచితాల ఆశ చూపి ఉద్యోగులను రోజంతా ఆఫీసులోనే కట్టేసే పద్ధతికి స్వస్తి పలికిన ఈ సంస్థ, వారికి దక్కుతున్న భారీ స్టాక్ ప్లాన్ల ద్వారా ఉద్యోగులను కోటీశ్వరులను చేస్తోంది.
కడుపు నిండా తిండి పెట్టకపోయినా కోట్లాది సంపద
చిన్నచిన్న క్యాంటీన్ సదుపాయాల కంటే దీర్ఘకాలిక సంపద సృష్టిపైనే యాజమాన్యం ప్రధాన దృష్టి పెట్టింది. కంపెనీ సాధిస్తున్న అద్భుతమైన ఆర్థిక వృద్ధి ఫలాలను ఉద్యోగులతో పంచుకోవడంలో ఈ స్టాక్ ప్లాన్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రోజూ తినే తిండి గురించి ఆలోచించకుండా ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఈ విధానం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది.