

వాషింగ్టన్ : అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఎదురైన పరాభవం రిపబ్లికన్ పార్టీలో అంతర్గత కలహాలకు దారితీసింది. ‘ఇరాన్‌తో ముగింపు ప్రణాళిక లేని యుద్ధానికి దిగడమే పార్టీ ఓటమికి కారణం. యుద్ధం కారణంగానే చాలామంది పార్టీ మద్దతుదారులు రిపబ్లికన్ పార్టీకి దూరమయ్యారు’ అని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. పరాజయానికి ట్రంప్ విధానాలే కారణమని టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ మాజీ కార్యనిర్వాహక డైరెక్టర్ చాడ్ విల్‌బ్యాంక్స్ విమర్శించారు. సుంకాల విధింపు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతు తెలపడం..పార్టీ ఓటమికి దారితీశాయని తప్పుబట్టారు. ‘ఇరాన్‌పై యుద్ధానికి అధ్యక్షుడు ట్రంప్‌ను రెచ్చగొట్టింది రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సిత్’ అని ట్రంప్ సన్నిహితులు మండిపడుతున్నారు. పార్టీ ఓటమి నేపథ్యంలో ట్రంప్ వ్యూహాలపై రిపబ్లికన్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తింది. ముఖ్య నేతలు ఆయన నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయటం కలకలం రేపుతోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పార్టీలో చాలా మంది నేతలను రెబల్స్‌గా మార్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా చట్టసభ సెనెట్‌లో డెమోక్రాట్ల పట్టు మరింత పెరిగింది. సెనెట్‌లో ప్రస్తుతం డెమోక్రాట్ల బలం 54కు పెరుగగా, రిపబ్లికన్ల సంఖ్య 44కు పడిపోయింది. ఇక ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 240 స్థానాలు, రిపబ్లికన్లకు 147 స్థానాలు దక్కాయి. గవర్నర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్లకు 28 స్థానాలు రాగా, రిపబ్లికన్లు 20 స్థానాలకు పరిమితమయ్యారు.
డాటా సెంటర్లతో ట్రంప్ కోటలు బద్దలు!
ఇరాన్ యుద్ధం వల్లనే ఓడిపోయామని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటున్నారు. కానీ, యుద్ధం వల్ల పెరిగిన ఇంధన ధరలు, నిత్యావసర సరుకులపై పరోక్ష భారం అమెరికన్ ప్రజలను బాగానే బాధించాయి! అయితే, ట్రంప్ పెట్టిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. అనేకం, అసంఖ్యాకం! అందులో ఒకటి కుప్పలుతెప్పలుగా డాటా సెంటర్లు! వ్యవసాయ క్షేత్రాలు ఎక్కువగా ఉండే టెక్సాస్, జార్జియా వంటి రాష్ట్రాలు రిపబ్లికన్లకు పెట్టనికోటలు! అక్కడ పెట్టిన డాటా సెంటర్లు పొలాలకు మిగల్చకుండా నీళ్లు తాగేస్తుండటంతో, రైతులు ట్రంప్ పార్టీని ఓడించి, నీలం పార్టీని గెలిపించారు! ఇది మనదేశంలో తెలుగు రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని, మనదగ్గర ఇప్పటికే నీటి కష్టాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. డాటా సెంటర్లపై ఏకపక్షంగా వెళితే, అమెరికా ఎన్నికల ఫలితాలే ఇక్కడా రిపీట్ అవుతాయనే మాటలు వినిపిస్తున్నాయి.
మార్కో రూబియో రాజీనామా!
రిపబ్లికన్ల ఓటమి నేపథ్యంలో ట్రంప్ సర్కార్‌లో లుకలుకలు మొదలయ్యాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రాజీనామా చేయబోతున్నారని తెలిసింది. అధ్యక్షుడు ట్రంప్ వైఫల్యాలు, ఇరాన్‌తో యుద్ధం..అంశాలకు దూరంగా నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం వచ్చారన్నది తాజా సమాచారం. 2028 అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగేందుకుగాను, మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని వార్తా కథనాలు వెలువడ్డాయి. అధ్యక్ష అభ్యర్థిత్వంపై రిపబ్లికన్ పార్టీలో జేడీ వాన్స్, రాన్ డెసాంటిస్‌ల కంటే రూబియో ప్రముఖ రిపబ్లికన్‌గా ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఇరాన్ విషయంలో రూబియో ఎలాంటి కామెంట్స్ చేయకుండా, మౌనం వహిస్తున్నారు. అంతేగాక, పార్టీ అభ్యర్థిత్వం కోసం ఐదుగురు క్యాబినెట్ సభ్యుల మధ్య పోటీ నెలకొన్నదని తెలిసింది. దీంతో వారు ట్రంప్ సర్కార్ నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.
మా మద్దతుదారులు డెమొక్రాట్లకు ఓట్లేశారు : వాన్స్
అంతకుముందు, మిడ్ టర్మ్ పోల్స్ ఫలితాలపై విశ్లేషణ చేస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇరాన్‌తో యుద్ధం, అమెరికాలో ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల గతంలో ట్రంప్‌నకు ఓట్లేసిన వాళ్లే ఈసారి డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘనవిజయం సాధిస్తారని సర్వేలు అంచనా వేసినప్పటికీ, పార్టీ మద్దతుదారులు తప్పక తమకే ఓట్లేస్తారనే ఆశావాదంతో రిపబ్లికన్లు వ్యవహరించారని వాన్స్ పేర్కొన్నారు. 2024లో రిపబ్లికన్లకు ఓటేసిన చాలామంది ఇప్పుడు కోపంగా ఉన్నారని, వాళ్లంతా ఈసారి ప్రత్యర్థులకు ఓటేయాలని అనుకుంటున్నారని తమ బృందంలోని ఓ డాటా నిపుణుడు ముందే చెప్పాడని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు చూస్తే ఆయన చెప్పిన మాట నిజమే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేయడం, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, అమెరికాకే తొలి ప్రాధాన్యం ఇవ్వడం, ఇజ్రాయెల్‌పై వైఖరిని మార్చుకోవడం అనే నాలుగు చర్యలను చేపట్టాలి. ఇవన్నీ చేస్తే మళ్లీ రిపబ్లికన్ల వైపు మొగ్గుచూపుతామని ఓ సర్వేలో ఓటర్లు చెప్పారు” అని వాన్స్ వివరించారు.