

అక్టోబర్ వచ్చిందంటే చాలు అమెరికా, యూరప్ సహా అనే దేశాల్లో ‘కాపాలికా.. ఆవాహయామి..’ అంటూ తారురోడ్డు మీద డబ్బాతో గోకినట్లు అమ్రిష్ పురి గొంతుతో ఆత్మలను ఆప్యాయంగా పిలుస్తారు... ‘కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో..’ అంటూ మెగాస్టార్ చిరులా అదిరిపోయే ‘గోలిమార్’ కేబరే డ్యాన్స్ లు వేస్తారు.. ‘నందికొండ వాగుల్లో నల్లతుమ్మ నీడల్లో..’ అంటూ ఇళ్లనే స్మశానంలా అలంకరించి పాటలు పోటీలు పెట్టుకుంటారు.. ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ఒకరినొకరు వింత వేషాలతో వెంటాడుతారు...
ఆగండాగండి.. ఇదంతా ఎందుకనుకుంటున్నారా? ఎందుకంటే ఇది ‘హాలోవీన్’ పండగలో భాగం కాబట్టి. మన దగ్గర పితృదేవతలను స్మరించుకుంటూ ‘పెత్తర్ల / పెద్దల అమావాస్య’ కార్యక్రమం జరుపుకుంటున్నట్లే అక్కడ ‘హాలోవీన్’ను జరుపుకుంటారు. చనిపోయినవాళ్లను, ఆత్మలను స్మరించుకోవడం, దుష్టశక్తుల నుంచి రక్షణ పొందాలనే కోరికతో ఈ పండగను చేసుకుంటారు. వీటిలో రొమేనియాలోని ట్రాన్సిల్వేనియా ప్రాంతంలో ఉన్న ‘బ్రాన్’ కోటలో జరిగే వేడుకలకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే.. ఇది రక్తపిశాచి డ్రాకులా కోట ! !
భయపెట్టే బ్రాన్ కోట..!
ట్రాన్సిల్వేనియాలోని మంచుతో కప్పుకున్న కార్పాతియన్ పర్వతశ్రేణుల్లో ఉన్న ఒక ఎత్తైన కొండపై, చుట్టూ ప్రకృతి అందాల మధ్య కనిపించే పురాతన కోట బ్రాన్. ఇది 14వ శతాబ్దం నాటిది. డ్రాకులాకు ఈ కోటతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. దీని నిర్మాణశైలి, చీకటి ఆవరణలు, పరిసరాలు, చారిత్రక నేపథ్యం మాత్రం పర్యాటకులకు అదే అనుభూతిని పంచుతాయి. ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తిస్తాయి. భయాన్నికలిగిస్తాయి. అందుకే, ఇది భయపెట్టే పర్యాటక ప్రాంతంగా మారింది. రొమేనియా చరిత్ర, సంస్కృతిలో భాగమైన బ్రాన్ కోటను హాలోవీన్ వేడుకల కోసం ప్రత్యేకంగా అలంకరిస్తారు. భయపెట్టే వేషధారణలు, ప్రత్యేక విందులు, గోతిక్ అలంకరణలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు. ఇవి పర్యాటకులకు ఆకట్టుకుంటాయి. వీటికి తోడు కొవ్వొత్తుల వెలుగులో విందులు, లాంతర్లు పట్టుకొని గుంపులు గుంపులుగా వీధుల్లో తిరగడం, స్థానిక జానపద కథల ప్రదర్శనలు, చీకట్లో నిర్వహించే ప్రత్యేక పర్యటనలు.. అదనపు అనుభూతి, ఆకర్షణ ఇస్తాయి. అయితే, ఈ వేడుకలు కేవలం బ్రాన్ కోటకు మాత్రమే పరిమితం కాదు. ట్రాన్సిల్వేనియాలోని చారిత్రక పట్టణాలు, పురాతన చర్చిలు, మధ్యయుగ నిర్మాణాలు, సాక్సన్ గ్రామాలు.. వీటన్నింటినిలోనూ బ్రహ్మాండంగా జరుగుతాయి.
రొమేనియాను చూడని బ్రామ్ స్టోకర్!
ఐరిష్ రచయిత బ్రామ్ స్టోకర్ రాసిన ‘కౌంట్ డ్రాకులా’ నవల 1897లో మార్కెట్లోకి వచ్చి, ప్రపంచవ్యాప్తంగా పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నవలలోని రక్తపిశాచి డ్రాకులా పుట్టిన ప్రాంతం ట్రాన్సిల్వేనియా. ఇది రొమేనియాలో ఉంది. నిజానికి బ్రామ్ స్టోకర్ కనీసం ఒక్కసారి కూడా రొమేనియాను సందర్శించలేదు. కానీ, నవలలో ట్రాన్సిల్వేనియాకు, బ్రాన్ కోటకు డ్రాకులాతో ముడిపెట్టారు. డ్రాకులా పాత్రకు కొంత ప్రేరణగా భావించే ‘వ్లాడ్ - ది ఇంపేలర్’ రాజుకు మాత్రం ట్రాన్సిల్వేనియాతో సంబంధాలు ఉన్నాయి. కానీ, అతనికీ బ్రాన్ కోటతో సంబంధాలున్నట్లు చారిత్రక ఆధారాలు లేవు. అయితే, ప్రజల పట్ల అతని ప్రవర్తన, పాలన, శిక్షలు మాత్రం నిజమేనని ఎన్నోచారిత్రక కథనాలున్నాయి. వీటి ఆధారంగానే డ్రాకులా పాత్రను బ్రామ్ స్టోకర్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. కొన్ని నిజాలు, మరికొన్నికల్పితాలు కలసి ట్రాన్సిల్వేనియాకు, ముఖ్యంగా బ్రాన్ కోటకు పర్యాటకం పరంగా అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చాయి. హాలోవీన్ వేడుకలకు స్పెషల్ డెస్టినేషన్ గా మార్చాయి.
కావల్సినంత ఆదాయం..
నిజానికి ‘హాలోవీన్’ రొమేనియా సంప్రదాయ పండగ కాదు. దీని మూలాలు ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి ప్రాంతాల్లో జరుపుకునే ప్రాచీన సెల్టిక్ సంప్రదాయాలతో ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేశాల్లో చలికాలం ప్రారంభం, పంటల కాలం ముగింపుతో అనుసంధానం చేస్తూ 'సామ్హెయిన్' అనే పండుగను జరుపుకొనేవాళ్లు. కాలక్రమంలో ఇదే ఇప్పటి హాలోవీన్ రూపానికి బీజం వేసింది. మరోవైపు, రొమేనియాలో మాత్రం ఆకురాలు కాలం చివర్లో ఒక వేడుక జరుపుకునేవాళ్లు. చనిపోయినవాళ్లను స్మరించుకోవడం, ఆర్థోడాక్స్ క్రైస్తవ సంప్రదాయాలు, ఆచారాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ వేడుక ఉద్ధేశ్యం. అయితే, అమెరికా, మెక్సికో మరికొన్ని దేశాల్లో జరపుకుంటున్నట్లు ఇంటిని గుమ్మడికాయలతో అలంకరించడం, భయానక వేషాలు ధరించడం, పిల్లలు ఇంటింటికీ వెళ్లి స్వీట్స్ తీసుకోవడం వంటి ఆధునిక హాలోవీన్ ఇక్కడ జరిగేది కాదు. కానీ, గత శతాబ్దం చివరిలో సినిమాలు, టీవీలు, తదితర వాటి ప్రభావంతో రొమేనియాలోనూ ఆ తరహా ‘హాలోవీన్’ చొచ్చుకొచ్చింది. దీనికితోడు డ్రాకులా నవల ట్రాన్సిల్వేనియాకు ప్రత్యేక గుర్తింపు తేవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. అలా, ఒక కల్పిత పాత్ర ట్రాన్సిల్వేనియాకు ప్రత్యేక గుర్తింపుతోపాటు కావల్సినంత ఆదాయం తెచ్చిపెడుతోంది.