

బ్రస్సెల్స్: యూరప్‌లో విమాన ప్రయాణాలు మరింత ఖరీదయ్యే అవకాశముంది. వచ్చే ఏడాది విమాన టికెట్ల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరగవచ్చని రియాన్ ఎయిర్ సీఈఓ మైఖేల్ ఓ లీరీ అంచనా వేశారు. " ఇరాన్ యుద్ధం కారణంగా జెట్ ఇంధన ధరలు ఒక్కసారిగా దూసుకుపోయాయి. దీనివల్ల ఇంధన ధరల హెడ్జింగ్ చేసుకోని విమాన సంస్థల లాభాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కారణాల వల్లే చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా విమాన ధరలు పెరగడం ఖాయం" అని ఆయన అన్నారు.
ఇంధన ధరల పెరుగుదలను ఎదుర్కొనే విషయంలో రియాన్‌ఎయిర్ మెరుగైన స్థితిలో ఉందని ఓ లీరీ తెలిపారు. చాలా విమానయాన సంస్థలు ఇంధన ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించే ఒప్పందాలు చేసుకోలేదని, దీంతో పెరిగిన ఖర్చుల భారం ప్రయాణికులపై పడుతోందని పేర్కొన్నారు. రాబోయే 12 నెలల్లో విమాన టికెట్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
విలీనాలు, దివాలాల పర్వం
విమానయాన రంగంలో రానున్న రోజుల్లో విలీనాలు, దివాలాలు పెరిగే అవకాశం ఉందని ఓ లీరీ అంచనా వేశారు. దీంతో విమాన సీట్ల లభ్యత తగ్గి టికెట్ల ధరలు మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. మరోవైపు బోయింగ్ సంస్థ తన కొత్త ‘మ్యాక్స్ 10’ విమానాలకు అక్టోబర్ నాటికి ధ్రువీకరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామాలు యూరప్ ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపనున్నాయి.