

సరిత కొమటిరెడ్డి అమెరికా రాజకీయాల్లో కీలక పదవికి పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో నిలిచారు. ప్రస్తుత అటార్నీ జనరల్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన లెటిషియా జేమ్స్‌తో తలపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆమెకు మద్దతు ప్రకటించడం ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
సరిత తల్లిదండ్రులు హనుమాన్ రెడ్డి, గీతా కొమటిరెడ్డి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందినవారు. వీరిద్దరూ వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. 1980వ దశకంలో మెరుగైన అవకాశాల కోసం అమెరికాకు వలస వెళ్లారు. అక్కడి బ్రూక్లిన్‌లో సరిత జన్మించారు. బాల్యంలో కొంతకాలం మిస్సోరి రాష్ట్రంలోనూ గడిపారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ కుటుంబానికి తెలంగాణతో ఉన్న అనుబంధం కొనసాగింది. తరచూ స్వస్థల ప్రాంతాన్ని సందర్శిస్తుండేవారు.
ఓ చిన్న గ్రామం నుంచి..
తన తండ్రి నేపథ్యం గురించి సరిత ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.. భారతదేశంలోని ఓ చిన్న గ్రామంలో కనీసం తాగునీటి సదుపాయం కూడా లేని పరిస్థితుల నుంచి తన తండ్రి ఎదిగారని చెప్పారు. అప్పటి సామ్యవాద పాలనా పరిస్థితుల్లో అమెరికాకు వలస వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారని వివరించారు. కష్టపడి పనిచేయడం, ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని సాధించేందుకు నిరంతరం ప్రయత్నించడమే అమెరికాకు రావడానికి తమ తండ్రికి ప్రధాన ప్రేరణ అని పేర్కొన్నారు. తల్లిదండ్రుల కృషి, త్యాగాల పట్ల తనకు ఎంతో గర్వమని ఆమె పలుమార్లు వెల్లడించారు.
9/11 దాడులు.. జీవితాన్ని మలుపుతిప్పిన ఘటన
సరిత జీవితంలో 2001 సెప్టెంబర్ 11 ఒక కీలక మలుపుగా నిలిచింది. అప్పటికి ఆమె కళాశాలలో చేరి వారం రోజులు మాత్రమే అయింది. న్యూయార్క్ నగరంపై అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడులు ఆమెను తీవ్రంగా కలచివేశాయి. ఆ ఘటన తర్వాతే న్యాయరంగంలోకి రావాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
తన ఎన్నికల ప్రచార వీడియోలో ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. 9/11 దాడులు తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయని చెప్పారు. ఉగ్రవాదులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు న్యూయార్క్ నగరాన్ని, అమెరికాను రక్షించేందుకు న్యాయవిద్య అభ్యసించాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు వివరించారు.
ఆ దాడులు ఆమెలో దేశ భద్రతపై బాధ్యతను మరింత పెంచాయి. ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడం, నేరస్థులను చట్టం ముందు నిలబెట్టడం వంటి లక్ష్యాలతో న్యాయవిద్య వైపు అడుగులు వేశారు.
హార్వర్డ్‌లో విద్యాభ్యాసం..
సరిత హార్వర్డ్ కాలేజీతోపాటు హార్వర్డ్ లా స్కూల్లోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ప్రముఖ న్యాయమూర్తి బ్రెట్ కవనాగ్ వద్ద న్యాయ సహాయకురాలిగా తన వృత్తిపరమైన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పట్లో కవనాగ్ కొలంబియా డిస్ట్రిక్ట్ సర్క్యూట్‌కు సంబంధించిన అమెరికా అప్పీల్స్ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన అమెరికా సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్‌గా ఉన్నారు. 2013లో న్యూయార్క్‌లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ అటార్నీ కార్యాలయంలో చేరిన సరిత, అసిస్టెంట్ యూఎస్ అటార్నీగా బాధ్యతలు చేపట్టారు. 2025 వరకు అక్కడ పనిచేస్తూ అనేక కీలక కేసుల విచారణలో భాగమయ్యారు.
ఉగ్రవాదం నుంచి సైబర్ నేరాల వరకు..
ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా సరితకు దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కేసులతోపాటు మెక్సికన్ డ్రగ్ ముఠాల కార్యకలాపాలపై జరిగిన దర్యాప్తులు, విచారణల్లో ఆమె కీలక పాత్ర పోషించారు.
అంతర్జాతీయ ఉగ్రవాదం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, ఆర్థిక మోసాలు, విదేశీ ప్రభుత్వ అధికారుల అవినీతి వంటి విభిన్న అంశాలకు సంబంధించిన కేసులను ఆమె చేపట్టారు. సంక్లిష్టమైన దర్యాప్తులను సమర్థంగా నిర్వహించడం ద్వారా న్యాయవర్గాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
2020 మే నెలలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్‌లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తిగా సరిత పేరును నామినేట్ చేశారు. అయితే ఆ నామినేషన్‌తో ఆమె న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టలేదు. 2023 నుంచి 2024 వరకు అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు. ఈ బాధ్యతల ద్వారా కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ కీలక అనుభవాన్ని సంపాదించారు.
మాజీ ఉన్నతాధికారి ప్రశంసలు
సరితతో కలిసి పనిచేసిన మాజీ ఉన్నతాధికారి రిచర్డ్ డోనోగ్యూ ఆమె పనితీరును ప్రశంసించారు. 2018 నుంచి 2020 వరకు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్‌కు అమెరికా అటార్నీగా పనిచేసిన ఆయన ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వృత్తిపరమైన ప్రతిభను వివరించారు. అనుభవజ్ఞులైన న్యాయవాదులు పనిచేస్తున్న కార్యాలయంలో చేరినప్పటికీ, సరిత తన సామర్థ్యంతో తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. కార్యాలయంలోని అత్యంత కీలకమైన కేసుల బాధ్యతలను ఆమెకు అప్పగించేవారని పేర్కొన్నారు. దేశ భద్రతకు సంబంధించిన దర్యాప్తుల నుంచి సంక్లిష్టమైన సైబర్ నేరాల విచారణ వరకు ఎన్నో బాధ్యతలను సమర్థంగా నిర్వహించారని కొనియాడారు. వృత్తిపరమైన బాధ్యతలతోపాటు కుటుంబానికి కూడా సరిత సమాన ప్రాధాన్యత ఇస్తారని డోనోగ్యూ వెల్లడించారు. నలుగురు పిల్లల తల్లిగా, తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించేవారని చెప్పారు. అప్పుడప్పుడు పిల్లలను కార్యాలయానికి కూడా తీసుకువచ్చేవారని గుర్తుచేసుకున్నారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి సరిత కొమటిరెడ్డి సరైన అభ్యర్థి అని తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అటార్నీ జనరల్ పదవిపై గురి
ప్రస్తుతం సరిత కొమటిరెడ్డి న్యాయవాద సంస్థ హోల్ట్జ్మన్ వోగెల్లో భాగస్వామిగా కొనసాగుతున్నారు. మరోవైపు కొలంబియా యూనివర్సిటీలో బోధిస్తున్నారు. నలుగురు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే వృత్తిపరమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2026 ఫిబ్రవరిలో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పొందారు. అక్టోబర్ 31న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆమె పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం రెండు పర్యాయాలుగా అటార్నీ జనరల్‌గా కొనసాగుతున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లెటిషియా జేమ్స్‌ను ఓడించి ఆ పదవిని దక్కించుకోవాలని సరిత లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలోని కరీంనగర్ మూలాలున్న కుటుంబంలో జన్మించి.. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి.. ఉగ్రవాదం నుంచి సైబర్ నేరాల వరకు కీలక కేసులను విచారించిన ఆమె.. ఇప్పుడు న్యూయార్క్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన పదవికి పోటీ చేస్తున్నారు.