ఫ్రాన్స్‌ను కుదిపేస్తున్న ‘18 ఏళ్ల విద్యార్థులు’

France Student Protests
France Students Protests over lack of funds and staffing issues in schools
Published on: 

పారిస్ : పాఠశాల విద్యార్థుల ఉద్యమం ఫ్రాన్స్‌ను కుదిపేస్తున్నది. వారంలో రెండోసారి గురువారం దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. 18 ఏళ్ల విద్యార్థుల ఉద్యమం రాజధాని పారిస్ సహా లియాన్, మార్సెల్లీ, నాంటెస్ నగరాలు, చిన్న చిన్న పట్టణాలకు విస్తరించింది. మేక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనబాటపడుతున్నారు. పారిస్‌లోని ఓ పాఠశాల వద్ద పోలీసులు విద్యార్థులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది. నగరంలోని హెలెన్ బూచర్ లిసే పాఠశాల వద్ద పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. కొందరు విద్యార్థులు చెత్త డబ్బాలను రోడ్డుపైకి తెచ్చి బారికేడ్లు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా నిరసనల్లో పోలీసులు ఇప్పటివరకు 6,600 మందికిపైగా అరెస్టు చేసినట్టు ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది. గురువారం 375 పాఠశాలలు మూతపడ్డాయని విద్యాశాఖ వెల్లడించింది. సెప్టెంబర్ చివరిలో మొదలైన విద్యార్థుల ఉద్యమం, ఇప్పుడు ఫ్రాన్స్ సరిహద్దులు దాటి బెల్జియంకు వ్యాపించింది.

పాఠశాలల్లో సమస్యలపై ఆగ్రహం

పాఠశాలలకు తగినంత నిధులు లేకపోవడం, భవనాల పరిస్థితి దెబ్బతినడం, సిబ్బంది కొరత వంటి సమస్యలు విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. కార్మిక సంఘాలు, రాజకీయ వర్గాలు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. విద్యార్థుల డిమాండ్లతో సంబంధం లేని కొందరు ఆందోళనల్లో చేరి హింసకు పాల్పడుతున్నారని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఆ దేశ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల సిబ్బందిపై దాడులు, పోలీసులకు గాయాలు, పాఠశాలలకు నిప్పుపెట్టడం, విధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.

కన్ను, చేయి కోల్పోవడానికి కాదు

పారిస్‌లో చదువుతున్న 18 ఏళ్ల ఎమ్మా ఖెలిల్ పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మా హక్కుల కోసం ఇక్కడ ఉన్నాం. కన్ను, చేయి కోల్పోవడానికి కాదు’ అని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు ఈ ఉద్యమం ఆగదని అన్నారు. ఆమె మాట్లాడిన కొద్దిసేపటికే పోలీసులు సమీపంలోని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరో చోట పోలీసులు విసిరిన గ్రెనేడ్ వల్ల 14 ఏళ్ల బాలుడి దవడ, పళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. లెన్స్‌ నగరంలో పోలీసుల దాడిలో 15 ఏళ్ల బాలుడు తన చేతిని కోల్పోయాడు. లోయిర్ ప్రాంతం టూర్స్‌లో 16 ఏళ్ల బాలుడు పాక్షికంగా అంధుడయ్యాడని అక్కడి ప్రాసిక్యూటర్ తెలిపాడు. దీనిపై అక్కడి న్యాయవాదులు, పరిశోధకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

బెల్జియంలో షురూ..

ఫ్రాన్స్ విద్యార్థుల ఉద్యమ ప్రభావం బెల్జియంపైనా పడింది. ఇక్కడి ‘లిజే’ నగరంలో ఘర్షణలు, విధ్వంసం జరిగే అవకాశం ఉందంటూ అక్టోబర్ 16 అర్ధరాత్రి వరకు బహిరంగ సమావేశాలను నగర మేయర్ విల్లీ డెమేయర్ నిషేధించారు. బ్రస్సెల్స్, ఆంట్వెర్ప్ నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు, చిన్న తరగతి గదులు కావాలని బెల్జియంలోని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. విద్యా సంస్కరణలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జెన్-జీలో పెరుగుతున్న అసంతృప్తి?

భారత్, ఫ్రాన్స్, స్పెయిన్, చిలీ.. దేశాల్లో జెన్ జీ యువత నిరసనబాట పడుతున్నది. ఈ నిరసనలకు వేరు వేరు కారణాలు ఉండొచ్చు, కానీ వీటన్నింటి వెనుక ఒకే సమస్య కనిపిస్తోంది. యువతకు ఉద్యోగాలు దొరకడం లేదు. భవిష్యత్తుపై ఆందోళన పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుందని, స్థిరమైన జీవితం ఏర్పడుతుందన్న నమ్మకం పోయింది. మరోవైపు ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి. సొంత ఇల్లు కొనడం భారంగా మారింది. ఇదే సమయంలో ఏఐ ప్రభావం పెరుగుతోంది. 2024 తర్వాత ఎంట్రీ-లెవల్ నియామకాలు గణనీయంగా పడిపోయాయి. ఉద్యోగ జీవితంలోకి యువత అడుగుపెట్టే మొదటి మెట్టు బలహీనపడుతోంది. యువతకు ఉద్యోగం, ఆర్థిక భద్రత, భవిష్యత్తుపై నమ్మకం కల్పించడం ప్రభుత్వాలకు సవాల్‌గా మారుతున్నది.