దుర్గాపూజ వేళ బీఫ్​ కిచిడీ ఫెస్ట్​తో కలకలం

ఢాకాలోని జగన్నాథ్ యూనివర్సిటీలో దుర్గాపూజ జరుగుతుండగా కొందరు విద్యార్థులు బీఫ్ కిచిడీ విందు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది.
Jagannath University Dhaka Bangladesh
Jagannath University Dhaka Bangladesh
Published on: 

ఢాకా: బంగ్లాదేశ్​లో​ మరోసారి మత విద్వేషాలను రెచ్చగొట్టే యత్నం జరిగింది. దేశ రాజధాని ఢాకాలోని జగన్నాథ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న హిందూ దేవాలయంలో దుర్గాపూజ జరుగుతున్న వేళ, సమీపంలోనే కొందరు విద్యార్థులు బీఫ్​ కిచిడీని వండారు. శుక్రవారం (అక్టోబరు 16న) ఉదయం జరిగిన ఈ ఘటనతో విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గతవారం రోజుల వ్యవధిలో వర్సిటీ క్యాంపస్​లో ఈవిధంగా బీఫ్ కిచిడీ విందును నిర్వహించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

హిందూ విద్యార్థుల నిరసన

అంతకుముందు, సోమవారం (అక్టోబరు 12న) రాత్రి విశ్వవిద్యాలయానికి చెందిన ఇస్లామిక్ హిస్టరీ అండ్ కల్చర్ విభాగం విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన సందర్భంగా క్యాంపస్‌లోని ఓపెన్ ఎయిర్ స్టేజీ వద్ద బీఫ్ కిచిడీతో విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కూడా క్యాంపస్​లోని హిందూ దేవాలయానికి సమీపంలోనే జరిగింది. బీఫ్​ కిచిడీని వండే తాత్కాలిక పొయ్యిని నిర్మించడానికి ఆలయానికి చెందిన ఇటుకలను ఉపయోగించారంటూ అక్కడున్న హిందూ విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తమ మతపరమైన భావాలను గాయపరిచిందని వారు నిరసన తెలిపారు. అయితే, వర్సిటీ క్యాంటీన్​లోని గ్యాస్ సిలిండర్ సరిగ్గా పనిచేయకే, తాము వంట వండే స్థలాన్ని ఓపెన్ స్టేజీ దగ్గరకు మార్చాల్సి వచ్చిందని బీఫ్​ కిచిడీ ఫెస్ట్​ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. పొయ్యి నిర్మాణానికి వాడిన ఇటుకలు ఆలయానికి చెందినవని తమకు తెలియదని, విషయం తెలిసిన వెంటనే వాటిని వాడటం ఆపేసి, క్షమాపణలు చెప్పి వంట స్థలాన్ని మార్చామన్నారు.

అక్టోబరు 14న నోటీసు.. ఆ వెంటనే ఉపసంహరణ

ఈ నేపథ్యంలో క్యాంపస్ లోపల ఎలాంటి జంతువులను వధించకూడదంటూ యూనివర్సిటీ పరిపాలనా విభాగం బుధవారం (అక్టోబరు 14న) ఒక నోటీసును జారీ చేసింది. అయితే, దీన్ని ఇస్లామిక్ హిస్టరీ అండ్ కల్చర్ విభాగం విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం అదేరోజు అర్ధరాత్రికల్లా తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ఇతరుల మతపరమైన భావాలను, ప్రార్థనా స్థలాలను గౌరవిస్తూ ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా క్యాంపస్​లో కార్యక్రమాలు, జంతు వధ చేసుకునే హక్కు అందరికీ ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో శుక్రవారం(అక్టోబరు 16న) క్యాంపస్​లో బీఫ్​ కిచిడీ ఫెస్ట్​ను విద్యార్థులు నిర్వహించారు. ఇందుకోసం వారు రూ.54 (70 టకాలు) చొప్పున చందాలు వేసుకుని ఒక ఆవును కొన్నారు. ఈ విందు కోసం తమ తరఫున ఒక ఆవును ఇస్తామని ఖిలాఫత్​ మజ్లిస్​ అనే రాజకీయ పార్టీ సైతం ప్రకటించడం గమనార్హం.