

వాషింగ్టన్ (అమెరికా): రష్యా నుంచి చమురు కొనే దేశాలపై భారీ సుంకాలు బాదుతానని తీవ్ర హెచ్చరికలు చేస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. బద్ధ విరోధి అయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో డీజిల్ కొనుగోళ్లకు శుక్రవారం (అక్టోబరు 9న) కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతులపై విధించిన ఆంక్షలను 2027 ఏప్రిల్ వరకు ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పుతిన్‌తో ఫోన్లో చర్చలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ దాకా డీజిల్‌ను సరఫరా చేసేందుకు రష్యాకు అమెరికా ఆర్థికశాఖ అక్టోబరు 9నే హుటాహుటిన తాత్కాలిక లైసెన్సును జారీ చేయడం గమనార్హం.
ట్రంప్ యూటర్న్‌కు తక్షణ కారణమిదీ
అమెరికాలో గ్యాసోలిన్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికల వేళ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుండటంతో ట్రంప్ ప్రస్తుతానికి వైఖరిని మార్చుకున్నారు. రష్యా ఇంధన వనరుల సప్లయ్‌లను అడ్డుకోవాలనే ఏకపక్ష వైఖరిని ఆయన వీడారు. ప్రజా వ్యతిరేకత పెరుగుతూపోతే రాబోయే మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ అమెరికన్ కాంగ్రెస్‌పై పట్టును కోల్పోయే ముప్పు ఉంది. ఎలాగైనా అమెరికన్ కాంగ్రెస్‌పై పట్టును నిలుపుకునేందుకు, ఓటర్లలో ఏర్పడిన ప్రతికూల భావనను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ఈ వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరుగుతూపోతున్న గ్యాసోలిన్, డీజిల్ ధరలకు సత్వరం కళ్లెం వేసి ప్రజలను శాంతింప చేసేందుకే ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం.
రష్యా నుంచి తక్షణమే డీజిల్ సరఫరా
‘‘శుక్రవారం రోజు నేను ఫోన్ కాల్లో పుతిన్‌తో మాట్లాడాను. 3 లక్షల టన్నులకుపైగా డీజిల్‌ను అమెరికాకు, అంతర్జాతీయ మార్కెట్‌కు రష్యా తక్షణమే సరఫరా చేసేలా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం నవంబరులో మరో 5 లక్షల టన్నుల డీజిల్‌ను రష్యా సరఫరా చేస్తుంది. ఆ తర్వాత వెంటనే అదనంగా ఇంకో 10 లక్షల టన్నుల డీజిల్‌ను అందిస్తుంది. తదుపరిగా రష్యాలోని రిఫైనరీల పరిస్థితులను బట్టి తక్కువ వ్యవధిలోనే మరో 30 లక్షల టన్నుల వరకు డీజిల్‌ను అమెరికాకు సరఫరా చేసే అవకాశం ఉంది. అమెరికన్లకు చౌకగా డీజిల్‌ను అందించాలనేది నా లక్ష్యం. దేశంలోని రైతులు, డ్రైవర్లు, సామాన్యులకే నేను తొలి ప్రాధాన్యత ఇస్తాను” అని పేర్కొంటూ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ పోస్టు చేశారు.
రష్యా సానుకూలం.. ఉక్రెయిన్ మండిపాటు
ట్రంప్ నిర్ణయంపై రష్యా సైతం సానుకూల ప్రకటన విడుదల చేసింది. ‘‘అమెరికా సహా ప్రపంచ మార్కెట్లకు చమురు, చమురు ఉత్పత్తులను సరఫరా చేసేందుకు మేం సిద్ధం” అని రష్యా సర్కారు వెల్లడించింది. ఇక ట్రంప్ నిర్ణయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తప్పుపట్టారు. ‘‘ఇది బలహీనమైన నిర్ణయం. దీన్ని నిజాయితీతో తీసుకోలేదు. దీని వల్ల అమెరికా, ఉక్రెయిన్ భాగస్వామ్య సంబంధాలకు ట్రంప్ విలువ లేకుండా చేశారు” అని విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.
భారత్కో న్యాయం.. అమెరికాకో న్యాయమా ?
తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా మొండి వైఖరితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. తనకో న్యాయం, ఇతరులకో న్యాయం అన్నట్టుగా ఏకపక్షంగా ప్రపంచ దేశాలపై సుంకాలను బాదుతున్నారు. రష్యా నుంచి చమురును కొంటున్నందుకుగానూ భారత్‌పై అదనపు సుంకాలను విధిస్తూ 2025 ఆగస్టు 6న ట్రంప్ ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు. భారత్ నుంచి అమెరికా మార్కెట్లోకి వచ్చే దిగుమతులపై 25 శాతం అదనపు సుంకాన్ని విధించారు. రష్యా నుంచి చమురును కొంటే, ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేందుకు రష్యాకు నిధులిచ్చినట్లు అవుతుందని ఆనాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వాదించారు. ఇప్పుడేమో తానే రష్యా డీజిల్ కోసం పాకులాడుతుండటం గమనార్హం. అవసరం అనేది ఎంతటి వాళ్లలోనైనా మార్పును తీసుకొస్తుంది అనేందుకు ఈ పరిణామమే నిలువెత్తు నిదర్శనం.