

వాషింగ్టన్: అమెరికాలో మంగళవారం (నవంబర్ 3న) జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ప్రపంచ మార్కెట్లనూ ప్రభావితం చేయనున్నాయి. స్టాక్ మార్కెట్లు, ఇంధన మార్కెట్ల నుంచి మొదలుకొని భారత్ ఎగుమతులు, ఐటీ, ఫార్మా పరిశ్రమల వాణిజ్య అవకాశాలు, రూపాయి మారకం విలువ, పెట్టుబడుల దాకా అన్నింటిపైనా ఈ రిజల్ట్స్ ఎఫెక్ట్ పడనుంది. సాధారణంగానైతే మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాలు అమెరికా రాజకీయ సమీకరణాలనే ప్రభావితం చేస్తుంటాయి. కానీ, ఈదఫా వెలువడే ఫలితాల పర్యవసానాలను ప్రపంచదేశాలూ ఎదుర్కోవాల్సి రావచ్చని వాణిజ్య వ్యవహారాల పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభల(సెనేట్, ప్రతినిధుల సభ)లో అధికార రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తే విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ట్రంప్ సర్కారుకు మరింత స్వేచ్ఛ లభిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని ఇతరదేశాలపై సుంకాలు బాదడం, ప్రభుత్వ వ్యయాలను నిర్ణయించడం, మార్కెట్ నియంత్రణపరమైన మార్పులను చేపట్టడం దిశగా దేశాధ్యక్షుడు ట్రంప్ అడుగులు వేసే చాన్స్ ఉంటుంది.
ఒకవేళ కాంగ్రెస్‌లోని ఏదైనా ఒక సభలో డెమొక్రాట్లు విజయం సాధిస్తే, ట్రంప్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోతుంది. ప్రత్యేకించి బడ్జెట్ కేటాయింపులు, చట్టాల రూపకల్పన వంటి అంశాల్లో ప్రతిపక్షాల సమ్మతిని సాధించనిదే సర్కారు ముందుకుసాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. షాకిచ్చే ఫలితాలు వచ్చినా దేశాధ్యక్షుడి వీటో అధికారం, ఇతరత్రా కార్యనిర్వాహక అధికారాలు యధాతథంగా కొనసాగుతాయి. కాంగ్రెస్‌పై డెమొక్రాట్లు పట్టు సాధించినా, ప్రపంచ దేశాలపై ట్రంప్ సర్కారు సుంకాల బాదుడు విధానం వెంటనే మారిపోతుందని భావించలేమని పరిశీలకులు అంటున్నారు.
డాలర్, యూఎస్ ఫెడ్లపైనా ఎఫెక్ట్
2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం సంపాదించే ఆదాయం కంటే అదనంగా సుమారు రూ.189 లక్షల కోట్లు (2 ట్రిలియన్ డాలర్లు) ఖర్చు చేయబోతోంది. కాంగ్రెస్‌లోని రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల సభ్యుల సంఖ్యాబలం అనేది ఈ నిధుల కేటాయింపుతో ముడిపడిన నిర్ణయాలను ప్రభావితం చేయనున్నాయి. ఈ పరిణామం ఎఫెక్ట్ అమెరికా డాలర్ రుణాలపై ఆధారపడే దేశాలు, కంపెనీలపై పడనుంది. 2026 ఏప్రిల్ – జూన్ త్రైమాసికం నాటికి ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో డాలర్ వాటా అత్యధికంగా 56.7 శాతం మేర ఉంది. కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లో తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాలు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పనితీరును ప్రభావితం చేస్తాయి.
భారత్‌లోని పలు రంగాలపైనా ప్రభావం
భారత్‌కు అమెరికా ఆర్థిక వ్యవస్థతో బలమైన సంబంధాలు ఉన్నాయి. 2025లో భారత్ నుంచి అమెరికాకు జరిగిన వస్తు ఎగుమతుల విలువ దాదాపు రూ.8.75 లక్షల కోట్లు (92.3 బిలియన్ డాలర్లు). ఇది భారతదేశ మొత్తం వస్తు ఎగుమతులలో దాదాపు 20.75 శాతం. అందువల్ల అమెరికా వాణిజ్య విధానం అనేది భారతీయ ఎగుమతిదారులకు ముఖ్యమైంది. అమెరికా మార్కెట్ నుంచి తక్కువ లాభాలు వచ్చే పరిస్థితి తలెత్తినా, అనుకూలత లేని చెల్లింపు నిబంధనలను అక్కడ అమల్లోకి తెచ్చినా భారత్‌లోని శ్రమ ఆధారిత పరిశ్రమలు ఒత్తిడికి లోనవుతాయి. ఇక భారత్‌లోని ఐటీ, వృత్తిపరమైన సేవల రంగాలు అమెరికా కార్పొరేట్ వ్యయం, నైపుణ్యం గల కార్మికుల చలనశీలతపై ఆధారపడి పనిచేస్తుంటాయి. ఈ అంశాలపై అమెరికా కాంగ్రెస్ ఆమోదించే బిల్లులు, తీసుకునే విధానపరమైన నిర్ణయాలు కీలకంగా మారుతాయి.