96 గంటల్లోగా ఆ దేశంపై దాడులు ?

ఇరాన్‌పై పెద్ద ఎత్తున సైనిక చర్యకు అమెరికా దళాలు సిద్ధమయ్యాయి. ట్రంప్ ఆదేశాలు వస్తే 96 గంటల్లోగా దాడులు ప్రారంభమయ్యే అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
US Military Ready For Iran Strikes
Published on: 

వాషింగ్టన్​: దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆదేశం అందిన 96 గంటల్లోగా ఇరాన్​పై దాడులు మొదలుపెట్టేందుకు అమెరికా సైన్యం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈసారి ఇరాన్​ ఇంధన మౌలిక వసతులు, సైనిక స్థావరాలు, అణు కర్మాగారాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ‘‘దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పచ్చజెండా ఊపిన వెంటనే ఇరాన్​పై మళ్లీ దాడులు మొదలయ్యే అవకాశం ఉంది” అని ఇద్దరు అధికారులు చెప్పారంటూ ఓ అమెరికన్​ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. అయితే దాడులను తిరిగి ప్రారంభించే అంశంపై ఇప్పటివరకు ట్రంప్​ ఒక నిర్ణయానికి రాలేదని పేర్కొంది.

ఇరాన్​ ప్రతిదాడుల పరిధి పెరగొచ్చు

అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబరు 3న జరగనున్నాయి. వీటి తుది ఫలితాలు డిసెంబరు రెండోవారంకల్లా వస్తాయి. ఈ రిజల్ట్స్​ వచ్చే వరకు ట్రంప్​ వేచి చూసే అవకాశం ఉందని అమెరికా సైనిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. గతంలోనూ దాడులకు రెడీ అన్న ట్రంప్​, చివరి నిమిషంలో నిర్ణయాలను మార్చుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈసారి అమెరికా– ఇజ్రాయెల్​ దాడులు చేస్తే, ఇరాన్​, యెమన్​ హూతీల ప్రతిదాడుల పరిధి పశ్చిమాసియా అవతలి దాకా విస్తరించే అవకాశం ఉంటుందని అమెరికా నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.

నెతన్యాహు ప్రతిపాదనకు ట్రంప్​ నో

అమెరికా, ఇజ్రాయెల్​లలో ఎన్నికలకు ముందే ఇరాన్​పై ఉమ్మడి దాడులు చేయాలని ఇటీవలే ఇజ్రాయెల్​ ప్రధానమంత్రి బెంజమిన్​ నెతన్యాహు ​ప్రతిపాదించగా, ట్రంప్​ నో చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఇజ్రాయెల్​ ప్రధాని కార్యాలయం ఖండించింది. ఇరాన్​పై ఇప్పుడే దాడులు చేస్తే, తమ దేశ ఎన్నికలను వాయిదా వేయాల్సి వస్తుందని ఇజ్రాయెల్​ మిలిటరీ చీఫ్​ ఇయల్​ జమీర్​ ట్రంప్​ను హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఈ కారణం వల్లే నెతన్యాహు ప్రతిపాదనకు ట్రంప్​ పచ్చజెండా ఊపలేదని, ఎన్నికల తర్వాతే ఉమ్మడి దాడులు చేద్దామని తేల్చి చెప్పారని పేర్కొన్నారు.

అరబ్​ దేశాల్లో అలర్ట్​

అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిశాక ఇరాన్​పై దాడులను మొదలుపెట్టే అవకాశం ఉందని అరబ్​ ​ దేశాలకు అమెరికా సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉన్నందున, పలు అరబ్ దేశాల్లోని బలహీనమైన సైనిక స్థావరాల నుంచి అమెరికా సైనికులను, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు మళ్లిస్తున్నట్లు సమాచారం.