భారతీయ టెక్ రంగంపై ‘పెర్మ్’ దెబ్బ

అమెరికాలో 'పెర్మ్' ప్రక్రియ నిలిచిపోవడంతో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెక్ నిపుణులపై ప్రభావంపై చర్చ మొదలైంది.
PERM Green Card Suspension
US PERM Green Card Certification Suspended Impact Indian Techies
Published on: 

న్యూఢిల్లీ: అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం అత్యంత కీలమైన 'పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రాసెస్' పెర్మ్ (పీఈఆర్ఎమ్) గత వారం నుంచి నిలిచిపోవడం అంతర్జాతీయంగా, ముఖ్యంగా భారతీయ టెక్ దిగ్గజాలు, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అమెరికా కార్మిక శాఖ నిర్వహించే ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో వేలాది మంది విదేశీ నిపుణుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి, గ్రీన్ కార్డ్ ప్రక్రియను ప్రారంభించడానికి ఈ కార్యక్రమం తొలి అడుగుగా భావిస్తారు. ఈ పరిణామం నేపథ్యంలో భారతీయ ఐటీ కంపెనీల భవిష్యత్తు, అమెరికాలో పనిచేస్తున్న మన దేశ టెక్ నిపుణులపై దీని ప్రభావం ఎలా ఉండనుందనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ఇది ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు విరుద్ధమని పేర్కొన్నారు.

 PERM కార్యక్రమం.. అంటే ఏమిటి?

అమెరికాలో తాత్కాలిక వర్క్ వీసా (హెచ్-1బీ)పై పనిచేస్తున్న వలసదారులు శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) పొందడానికి 'పెర్మ్' (PERM) మొదటి మెట్టు. అమెరికా కార్మిక శాఖ జారీ చేసే ఈ సర్టిఫికేషన్ ద్వారా అక్కడి కంపెనీల యజమానులు విదేశీ కార్మికులను గ్రీన్ కార్డ్ కోసం స్పాన్సర్ చేయవచ్చు. ఈ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, ఆ కంపెనీ లేదా యజమాని.. 180 రోజుల్లోగా 'యూఎస్‌ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్' (యూఎస్‌సీఐఎస్) వద్ద ఐ-140 ఫారమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తుదారు పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ఐ-485 ఫారమ్ సమర్పించవచ్చు. ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన నిబంధన ఏమిటంటే.. విదేశీ కార్మికుడికి ఆఫర్ చేసిన ఉద్యోగాన్ని చేసేందుకు తగిన అర్హతలు, ఆసక్తి ఉన్న స్థానిక అమెరికన్ కార్మికులు ఎవరూ లేరని కార్మిక శాఖ ధృవీకరించాల్సి ఉంటుంది. అంటే తమ వద్ద లేని నైపుణ్యాన్ని బయటి నుంచి తీసుకోవడం అన్నది వారి ఆలోచన.

 ఏయే కంపెనీలపై ప్రభావం పడింది?

మైక్రోసాఫ్ట్, అడోబి వంటి పెద్ద టెక్ కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్, కానిజెంట్, క్యాప్‌జెమినీ వంటి ఐటీ సేవల సంస్థలు పెర్మ్ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేశాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ అగ్రస్థానంలో ఉన్నట్టు సమాచారం. అందుకే మొన్న ఓ సందర్భంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీ వ్యవహారంపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. సుమారు 6,000 మంది అమెరికా ఉద్యోగస్తులను తొలగించి, అదే సమయంలో 6,000 కంటే ఎక్కువ హెచ్-1బీ వీసాలు, 3,682 పెర్మ్ దరఖాస్తులను సమర్పించిందని వాన్స్ వెల్లడించారు. తొలగించబడిన ఉద్యోగాలకు సమానమైన స్థానాలకే దాదాపు 1,000 శాశ్వత నివాస దరఖాస్తులు ఉన్నట్లు ఆయన ఆరోపించారు. దీనిపై మైక్రోసాఫ్ట్ స్పందిస్తూ.. గత ఏడాది దాఖలు చేసిన హెచ్-1బీ వీసాలలో 80 శాతం కొత్త నిపుణుల కోసం కాదని, ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల కోసమేనని వివరణ ఇచ్చింది.

 భారతీయ ఐటీ రంగానికి ఊరట.. కానీ దీర్ఘకాలిక సవాళ్లు

గత కొన్ని సంవత్సరాలుగా హెచ్-1బీ మార్గంపై ఆధారపడటాన్ని భారతీయ ఐటీ కంపెనీలు గణనీయంగా తగ్గించుకున్నాయి. గత రెండేళ్లలో టీసీఎస్ (టీసీఎస్) పెర్మ్ దరఖాస్తులు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నాయని, అందువల్ల ఈ సస్పెన్షన్ తమ సిబ్బంది ప్రణాళికలను మార్చదని కంపెనీ స్పష్టం చేసింది. అక్టోబర్ 2024 నుండి సెప్టెంబర్ 2025 మధ్య కాలంలో దాఖలైన మొత్తం పెర్మ్ దరఖాస్తులలో భారతీయ ఐటీ సంస్థల వాటా 2 శాతం కంటే తక్కువే ఉంది. అయినప్పటికీ, దీర్ఘకాలంలో ఉద్యోగుల నిలుపుదల, కొత్త నిపుణుల నియామకం, నియంత్రణ, నిర్వహణ వ్యయాలు పెరుగుతాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ తాత్కాలిక నిలిపివేత వల్ల భవిష్యత్తులో నైపుణ్యాభివృద్ధి, ఉత్పాదకతను పెంచే ఆటోమేషన్ ద్వారా భారత్ మరింత పటిష్టమైన టాలెంట్ ఎకోసిస్టమ్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉంది. కంపెనీలు కూడా తమ డెలివరీ మోడళ్లను వివిధ ప్రాంతాలకు విస్తరించుకోవడానికి ఇది దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు తెలిపారు.

 అమెరికాలోని భారతీయ టెక్కీలపై ప్రభావం

ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై ఉన్న ప్రస్తుత ఉద్యోగులపై దీని ప్రత్యక్ష ప్రభావం ఉండదు. అయితే, బ్లాక్‌లిస్ట్ చేయబడిన కంపెనీలలో పనిచేస్తూ, కంపెనీ స్పాన్సర్‌షిప్‌తో పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల ప్రయాణానికి మాత్రం తీవ్ర ఆటంకం కలుగుతుంది. సాధారణంగా గ్రీన్ కార్డ్ ప్రక్రియ నిర్దిష్ట మైలురాయిని చేరుకుంటే తప్ప హెచ్-1బీ వీసా గడువు 6 సంవత్సరాలకు పరిమితం అవుతుంది. బ్లాక్‌లిస్ట్ చేయబడిన కంపెనీలలో పనిచేస్తూ 6 సంవత్సరాల గడువు ముగింపు దశకు చేరుకున్న హెచ్-1బీ ఉద్యోగులకు తీవ్ర ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు వెల్లడించారు. వీరు వేరే యజమానికి మారడం లేదా మొదటి నుంచి ప్రక్రియను పునఃప్రారంభించడం, లేదంటే అమెరికాను వీడి వెనక్కు రావలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ నిఘా హెచ్-1బీ పిటిషన్లకు కూడా పాకితే, ఇప్పటికే అనిశ్చితిలో ఉన్న అనేక మందికి ఇది పెద్ద సమస్యగా మారుతుందని విశ్లేషకులు హెచ్చరించారు.

 కేంద్రం స్పందన.. మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు, శాస్త్రీయ ఆవిష్కరణలకు అత్యంత విద్యావంతులైన, నైపుణ్యం కలిగిన భారతీయ సంతతి టెక్కీలు ఎంతగానో ఉపయోగపడుతున్నారనే వాస్తవాన్ని ఈ నిబంధనల మార్పు విస్మరించిందని పేర్కొంది. మరోవైపు, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఆంక్షలు భారత్‌కు ఒక గొప్ప అవకాశమని వెల్లడించారు. ఇన్నాళ్లూ అమెరికాకు పనిచేస్తున్న అత్యుత్తమ ప్రతిభను ఆ దేశం కోల్పోతోంది’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న భారతీయ సంతతి కుబేరుల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఒకవేళ వారు తమ వ్యాపారాలను, పరిశోధనలను భారత్‌లోనే చేసి ఉంటే ఎంత బాగుండేది’’ అని ఆయన ఆకాంక్షించారు. దేశంలో పెరుగుతున్న జీసీసీ (జీసీసీ) ఎకోసిస్టమ్ గురించి చెబుతూ.. అమెరికా నుంచి సాఫ్ట్‌వేర్, టెక్నాలజీలకు చెందిన పనులన్నీ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, పుణె, గురుగ్రామ్, ముంబై నగరాలకు వస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా నుంచి భారత్‌కు రివర్స్ బ్రెయిన్ డ్రైన్ కారణంగా దేశీయ డీప్ టెక్ స్టార్టప్‌లకు అపారమైన వృద్ధి లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.