

వాషింగ్టన్: తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రతిష్ఠాత్మక పురస్కారం పులిట్జర్ తనకు ఇవ్వాల్సిందని కొత్తరాగం అందుకున్నారు. దక్షిణ కరోలినాలో గురువారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘నాకు నోబెల్ బహుమతి రాలేదు. నా రచనలకు పులిట్జర్ రావాల్సింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. రష్యాపై కథనాలు రాసి పులిట్జర్ అవార్డులు పొందిన వారు ఆ పురస్కారాలకు అర్హులు కారని ట్రంప్ వ్యాఖ్యానించారు. వారు రాసిన కథనాలు తప్పులతడకగా ఉన్నాయని విమర్శించారు. అయితే, తన ఏ రచనకు పులిట్జర్ రావాల్సిందనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. అమెరికా, జర్నలిజం, సాహిత్యం, నాటకం, మ్యూజిక్ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పులిట్జర్ అవార్డును కొలంబియా యూనివర్సిటీ అందజేస్తుంది. ట్రూత్ సోషల్ వేదికపై ట్రంప్ చేసే వ్యాఖ్యలతో పాటు వ్యాపారం, వ్యూహాలు, రాజకీయాలకు సంబంధించిన దాదాపు 20 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. వీటిలో చాలా పుస్తకాలను ఘోస్ట్ రైటర్ల సహకారంతో రూపొందించారు. 1987లో ఆయన రాజకీయాల్లోకి రాకముందే ‘ది ఆర్ట్ ఆఫ్ ది డీల్’ పేరుతో టోనీ ష్వార్ట్జ్ అనే ఘోస్ట్ రైటర్ ఓ పుస్తకాన్ని రచించారు.